Oscar 2023 Naatu Naatu song: మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.. తెలుగు చిత్రసీమలో ఎన్నో హిట్ సినిమాలకు అత్యద్భుతమైన సంగీతం అందించారు. ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడానికీ సంగీతాన్నే నమ్ముకుని కెరీర్‌ను ప్రారంభించారు. రోజుకు ముఫ్పై రూపాయల జీతం నుంచి ఇప్పుడు విశ్వవేదికపై సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను అందుకునే స్థాయికి ఎదిగారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRRలోని 'నాటు నాటు' సాంగ్‌కు అద్భుతమైన మ్యూజిక్‌ను అందించి.. ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. లిరికిస్ట్ చంద్రబోస్‌తో కలిసి అవార్డును ముద్దాడారు. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం వీరిద్దరు పురస్కారంతో అభివాదం చేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన కీరవాణి భావోద్వేగంతో ప్రసంగించారు. "నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే RRR గెలవాలి. ఇది ప్రతి భారతీయుడి గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసింది." అని కీరవాణి మాట్లాడారు. ఆస్కార్‌ను చేతబట్టుకుని ఇంగ్లీష్‌లో ఓ పాట పాడుతూ పరవశించిపోయారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తీకేయ, తన కుటుంబ సభ్యుల సహకారాన్ని.. ఈ పాట ద్వారా చెబుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక కీరవాణి కెరీర్ విషయానికొస్తే.. 'మనసు-మమత' సినిమాతో సంగీతదర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తొలి పాట 'మధుమాసం కుహూగానం'. ఆ తర్వాత 'దాగుడు మూతల దాంపత్యం', 'అమ్మ', 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' వంటివి వచ్చినా 'సీతారామయ్యగారి మనవరాలు' మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. ఆ తర్వాత 'క్షణక్షణం', అల్లరిమొగుడు ఘరానామొగుడు, సుందరకాండ, అల్లరిప్రియుడు, ఎన్నో హిట్ చిత్రాలకు బాణీలు అందించారు. ముఖ్యంగా రాజమౌళి చేసి ప్రతి సినిమాకు ఆయనే బాణీలు కడతారు. ఆయన సంగీతం అందించిన ఎన్నో పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఇప్పటిదాకా ఆయన దాదాపు 250 సినిమాలకు పనిచేశారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగే అయినా... తమిళం, మలయాళం, కన్నడం, హిందీల్లోనూ చేసిన పాటలు ఆయన్ను జాతీయస్థాయి సంగీతదర్శకుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు గోల్డెన్‌గ్లోబ్, ఆస్కార్ అవార్డులతో తెలుగుపాటకు విశ్వవేదిక మీద పట్టం కట్టించారాయన.
అవార్డులు.. ఈయనకు తొలి అవార్డు మాత్రం తమిళ చిత్రసీమ నుంచి వచ్చింది. అజ్హఘన్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో పురస్కారాలను దక్కించుకున్న ఆయన.. రీసెంట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్, అకాడమీ అవార్డ్‌లో నాటు నాటు పాటకు పురస్కారాన్ని అందుకున్నారు. అలానే ఈ ఏడాది పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
ఇదీ చూడండి:హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు