ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుందని నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'లైగర్' ట్రైలర్ రిలీజ్ వేడుక గురువారం ఉదయం సుదర్శన్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్.. ''ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా కుటుంబం గురించి తెలియదు. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అది కూడా అంత పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్‌కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్‌లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా షేక్ అవుతుంది'' అని అన్నారు.
అనంతరం చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ''నేను 'లైగర్' గురించి చెప్పడం లేదు. కేవలం విజయ్ గురించే చెబుతున్నా. సినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ పేరు గొప్పగా వినిపించనుంది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ మాకెంతో అండగా నిలిచారు. ఆయన్ని ఇక్కడికి పిలిచింది ట్రైలర్ చూపించడానికి కాదు. సినిమాపై మన తెలుగువాళ్లకు ఉన్న ప్రేమను చూపించడానికి. ఆగస్టు 25న అదరగొట్టేద్దాం'' అని తెలిపారు. ఇక థియేటర్‌లో అభిమానుల సందడి చూసిన నటి అనన్య ఆశ్చర్యపోయారు. తెలుగువారి ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.