Adipurush Trolls : 'ఆదిపురుష్'పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. ఈ సినిమా టీజర్‌కు వస్తోన్న ప్రతికూల స్పందనలపై ఆయన మరోసారి స్పందించారు. బిగ్ స్క్రీన్ కోసమే ఈ చిత్రాన్ని సిద్ధం చేశామన్నారు. "టీజర్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. టీజర్‌లో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశాం. చిన్న వీడియోను చూసి సినిమాపై అంచనాకు రావొద్దు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలయ్యాక.. చూసి ఎవరూ నిరాశచెందరు. కావాలంటే నోట్ రాసిస్తా. తప్పకుండా సినిమా అందర్నీ అలరిస్తుంది" అని ఓం రౌత్ అన్నారు.
ప్రభాస్ నో అంటే చేసేవాడిని కాదు!
"ప్రభాస్ కోసమే రాఘవ పాత్ర రాశాను. కథ రాస్తున్నంతసేపు నా మైండ్‌లో ప్రభాసే ఉన్నాడు. ఆయన కోసమే సినిమా తెరకెక్కించా. ఆయన నో అంటే సినిమా చేసేవాణ్ని కాదు. ఆయన అద్భుతంగా నటించారు" అని ఓం రౌత్ వివరించారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్'ను రూపొందించారు. ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీతగా చేసింది. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో నటీనటుల లుక్స్, వీఎఫ్‌ఎక్స్ సరిగ్గా లేవని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాపై కాపీ కొట్టారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇటీవల ఓ యానిమేషన్ సంస్థ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'సిగ్గుచేటు ఒరిజినల్ క్రియేటర్ ఎవరో చెప్పాలి' అంటూ విమర్శలు చేసింది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ కూడా నాసి రంకంగా ఉన్నాయని భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దర్శకనిర్మాతలు ఎంత చెబుతున్నా ట్రోలింగ్ ఆగలేదు. ఆఖరికి గురువారం టీజర్‌ను తెలుగులో త్రీజీలో దాదాపు 60 థియేటర్లలో స్క్రీనింగ్ చేశారు.