NTR 30 Title: కథానాయకుడు ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ కలయికలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు కథకు, ఇటు ఎన్టీఆర్ ఇమేజ్‌కు సరిపోయేలా 'దేవర' అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
'దేవర' టైటిల్ గురించి మరో ఆసక్తికర విషయం కూడా సోషల్‌మీడియా చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్‌ను నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేయించారు. అయితే, ఇటీవల గడువు ముగియడంతో బండ్ల గణేశ్ మళ్లీ దాన్ని పునరుద్ధరించటం మర్చిపోయారట. దీంతో కొరటాల శివ ఈ టైటిల్‌ను తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్30 పూర్వ నిర్మాణ పనుల్ని చకచకా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఛాయాగ్రాహకుడు రత్నవేలుతో కలిసి కొరటాల కసరత్తులు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలియజేశాయి.
"ఎన్టీఆర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ కథపై చిత్ర బృందమంతా నమ్మకంతో ఉంది. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది" అని సినీవర్గాలు తెలిపాయి. సంగీతం: అనిరుధ్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్.