టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! తారక్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్30 అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథా నాయకగా నటించనుందని అధికారికంగా ప్రకటించారు. సోమవారం జాన్వీ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్30 మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. "ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని జాన్వీకపూర్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు.
అయితే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ నందమూరి తారకరత్న మరణం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్న విధంగా స్టార్ట్ కానుందట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుందట. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ 20వ సెంచరీది కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తనకు రచయితగా బృందావనం, దర్శకుడిగా జనతా గ్యారేజ్ వంటి విజయవంతమైన సినిమాలు అందించిన కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా కోసం భారీ ప్లానింగ్ జరుగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు.
మరోవైపు, ఆస్కార్ అవార్డ్స్ కోసం సోమవారం ఉదయం ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లారు. అందుకు సంబంధించిన చిత్రాలు.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ ఏంజిల్స్ వెళ్లిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌తో ఎన్టీఆర్ సమావేశం అవుతారట. ఆ తర్వాత అక్కడి స్టంట్ మాస్టర్లతో కూడా డిస్కషన్స్ చేస్తారట.