తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ విషయంలో ఎన్టీఆర్​ తనకు తానే సాటి..! - ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు

NTR 100year birth anniversary: అపూర్వ సహోదరుల తరహా పాత్రల్లో సినిమాలు మన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. మనిషిని పోలిన మనుషులు, కవలలైతే.. అందులో సినిమా కథలయితే ఆ వినోదానికి, ప్రమోదానికి హద్దులే ఉండవు. ఎన్టీఆర్​ 1964లో తొలిసారి రాముడు- భీముడులో ద్విపాత్రాభినయం చేశారు. తర్వాత మూడు నుంచి ఐదు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ సినిమాలేంటో చూద్దాం. దీంతోపాటే ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

NTR highest five roles srimadviraraparvam
ఒకేసారి ఐదు పాత్రల్లో.. ఆ ఘనత ఎన్టీఆర్​కే సాధ్యమైంది

By

Published : May 28, 2022, 6:20 AM IST

NTR Five roles in one movie: ద్విపాత్రాభినయాలు, బహుముఖ పాత్రాభినయాలలో ఎన్టీఆర్ తనకు తానే సాటి. తొలిసారి 1964లో రాముడు-భీముడులో ద్విపాత్రాభినయం చేశారు. తర్వాత అదే ఏడాది అగ్గిపిడుగు, శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహత్యం 3 సినిమాలలో రెండేసి పాత్రలు పోషించి రికార్డు నెలకొల్పారు. ఇక ఆయన బహుముఖ పాత్రాభినయాలు చూస్తే... మంగమ్మ శపథం, శ్రీకృష్ణపాండవీయం, గోపాలుడు- భూపాలుడు, నిర్దోషి, తిక్క శంకరయ్య, భలే తమ్ముడు, గండికోట రహస్యం, తాతమ్మకల, శ్రీరామ పట్టాభిషేకం, సర్కస్‌రాముడు, విశ్వరూపం, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, చండశాసనుడు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. కులగౌరవం చిత్రంలో ఆయన తాత, తండ్రి, కొడుకుగా మూడు పాత్రలు పోషించారు.

శ్రీకృష్ణసత్యలో రాముడు, కృష్ణుడు, రావణాసురుడిగా నటించి రక్తి కట్టించారు. దానవీర శూర కర్ణలో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడి పాత్రలు పోషించారు. వీరబ్రహ్మంగారి చరిత్రలో బ్రహ్మం, వేమన, శంకరాచార్య, రామానుజాచార్య పాత్రల్లో కనిపించారు. శ్రీమద్విరాటపర్వంలో ఏకంగా అయిదు పాత్రల్లో కన్పించటం విశేషం.

మరిన్ని విశేషాలు..

  • ఎన్టీఆర్​ చదువుకునే రోజుల్లోనే కుటుంబ అవసరాల కోసం పాలును హోటల్స్​కు సరఫరా చేసేవారు
  • 'పాతాళభైరవి' చిత్రంలో తన సహచరుడైన ఆ తరం నటుడు బాలకృష్ణ మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా రావడంతో అతణ్ణి తన చిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే, దానివలన అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ప్రయత్నాన్ని వారించి, బాలకృష్ణను ఇంటికి పిలిచి రామారావు మందలించారు. ఆ తరువాత బాలకృష్ణ ఏనాడూ షూటింగుకు ఆలస్యంగా రాలేదు. అలా మానవత్వ విలువల్ని కాపాడే వ్యక్తిత్వం మూర్తీభవించిన మనీషి ఈ తారకరాముడు.
  • సినిమాల్లో మారువేషాలు వేయడం రామారావుకు ఇష్టం. అది జానపదమైనా, సాంఘికమైనా ఒకటి లేక రెండు మారువేషాలు ఉండేలా స్క్రిప్టు తయారు చెయ్యమని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. విజయవాడలోని దుర్గా కళామందిర్‌కు రామారావుకు అవినాభావ సంబంధం ఉంది.
  • రామారావు తొలి చిత్రం 'మనదేశం' చివరి చిత్రం 'మేజర్‌ చంద్రకాంత్‌' ఈ చిత్రశాలలోనే ఆడాయి. అంతేకాదు, రామారావు నటించిన అధికశాతం సినిమాలు (63) ఆడింది ఈ సినిమా హాలులోనే కావడం విశేషం.
  • కెరీర్​లో దాదాపుగా 17దేవుళ్ల పాత్రలను పోషించి విమర్శకుల చేత శభాష్​ అనిపించుకున్నారు.
  • రామారావుది క్రమశిక్షణ గల జీవితం. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగాసనాలు వేసి, కాలకృత్యాలు తీర్చుకొని, ఉదయం ఆరు గంటలకే భోజనం చేసిమేకప్‌ చేసుకొని ఆరున్నరకే తయారై కూర్చొని, తన సొంత సినిమాల విషయాలు చూసుకోనేవారు. షూటింగుకి ఏనాడూ ఆలస్యంగా వెళ్లలేదు. నిర్మాతకు ఏనాడూ తనవలన ఇబ్బంది కలిగే అవకాశం ఇవ్వలేదు.
  • రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్‌లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్లంతా అలర్ట్ అయి లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్‌.టి.ఆర్‌ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటి నుంచి మంచినీళ్ల బిందె కూడా వచ్చేది. మంచి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.

ఇదీ చూడండి: రివ్యూ: 'ఎఫ్‌3' మూవీ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details