తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ చిత్రాలే ఎన్టీఆర్​ను కలల రాకుమారుడిని చేశాయి!

NTR 100 years Birth anniversary: మాయా లాంతర్లు, మాయల ఫకీర్లు. ఏడు సముద్రాల అవతల చిలక గుండెల్లో డింభకుడి వలపుల చిలకమ్మ ప్రాణాలు. చిలకను తెచ్చి చిలకమ్మను కాపాడే రాజు అనే సాహసికుడు. రాజుగారి రాజపుండు నయం చేసే యువకుడి వీరగాథలు. రాజుగారికి ఉపాయాలు చెప్పి, అపాయాలు తప్పించే సాహసికుడు. కత్తియుద్ధాలు, మల్లయుద్ధాల్లో శత్రువును మట్టుపెట్టడం, కోటలో పాగా వేయటం. జానపద చిత్రాలంటే కత్తిమీద సామే మరి. ఆ సినిమాల్లోనూ విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ కత్తిలా దూసుకెళ్లారు. ఇంతకీ ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం..

NTR Janapada movies
ఎన్టీఆర్ జానపద చిత్రాలు

By

Published : May 28, 2022, 11:38 AM IST

NTR 100 years Birth anniversary: చందమామ కథలు. బుజ్జాయి కథలు, బులిపించే కథలు, బేతాళ కథలు. నేపాళ మాంత్రికుల కథలు. ఏదైనా పిల్లలకు సాహసాలు ఇష్టం. పెద్దపులి కథలు చెప్పుకొని జడుసుకోవటమే ఇష్టం. అలాంటి కథలు సినిమాలుగా వచ్చాక.. ఆ సినిమాల్లో ఎన్టీరాముడే వెండితెరపై రాకుమార్తెల కలల రాకుమారుడు అయ్యాడు. మెదడుకు మేతపెట్టే పజిల్స్, గేమ్స్ లేని కాలంలో, బాలల ఊహాశక్తి వికాసానికి, సృజనకు ఊతమిచ్చినవి జానపద సినిమాలే. నిజం చెప్పాలంటే మాయల మరాఠీని జయించిన తోటరాముడు పాతాళ భైరవి చిత్రమే ఎన్టీఆర్ ను జానపద చిత్రాల వైపు నడిపించింది. అప్పటికే అక్కడ కత్తి కాంతారావు జానపద హీరోగా అగ్రశ్రేణికి ఎదిగారు. స్పైడర్ మేన్లు, టార్జాన్లు లేని కాలంలో తెలుగు బాలలకు అలాంటి కలలు కళ్లముందు ఆవిష్కరించిన సినిమాల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఊహా చిత్రాలకు, ఊహాకల్పనకు అవకాశం కల్పించి పిల్లల మేధస్సుకు పదనుపుట్టే అలాంటి జానపద సినిమాలలో నందమూరి తారక రామారావు నటించి ఓ ముద్రవేశారు. జానపద చిత్రాల్లో నటించే ఎన్టీఆర్ పిల్లలకు, పెద్దలకూ ప్రాణప్రదమయ్యారు.

1954లో కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన జానపద చిత్రం 'చంద్రహారం' ఎన్టీఆర్, శ్రీరంజని, సావిత్రి నటించారు. విజయా ప్రొడక్షన్ సినిమా. చందన రాజు ప్రాణం అతని మెడలోని హారంలో ఉంటుంది. ఈ హారం చుట్టూ తిరిగే రాకుమారులు, శాపాలు, శాపవిమోచనాల కథ. 1957 ఎన్టీఆర్ నటించిన 'వీరకంకణం', 'సారంగధర' జానపద గాధా చిత్రాలే. జయసింహ, జయం మనదే , బందిపోటులో సంభాషణలు పరిశీలిస్తే.. ఆయన జానపద చిత్రాలలోనూ తాను నమ్మిన అభ్యుద సందేశాలిచ్చారని అవగతమవుతుంది. జానపద సినిమాల్లో బాలనాగమ్మను చెప్పుకోవచ్చు.

1959 లో వచ్చిన ఈ చిత్రంలో సాహసాల కార్యవర్ధిరాజుగా ఎన్టీరామారావు, బాలనాగమ్మగా అంజలీదేవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాయల మరాఠీగా ఎస్వీరంగారావు అపురూప నటన కూడా ప్రశంసలు అందుకుంది. 1960లో పలకరించిన వాహినీ వారి రాజమకుటం లో ఓ పాట మకుటాయమానంగా నిలిచింది. ఎన్టీఆర్, రాజసులోచన నటించిన ఈ సినిమాలో పి.లీల ఆలాపన...'సడిసేయకో గాలి'. శీతల సమీరంలా సేదతీర్చిన ఈ గీతాన్ని ప్రేక్షకులు మనసు పొరల్లో భద్రపర్చుకున్నారు. 1960లో బి. విఠలాచార్య తీసిన 'భట్టివిక్రమార్క' మరో జానపద చిత్రం. జానపద సినిమాల్లో ఎన్టీఆర్ హీరోధాత్తంగా, ధీరోధాత్తంగా నటించి ప్రేక్షకులకు తనని తాను కొత్తగ పరిచయం చేసుకున్నారు.

ఎన్టీఆర్ కు జానపద చిత్రాలలో అవకాశాలు రాసాగాయి. మరుసటి ఏడాది 1961 లో కేవీ రెడ్డి దర్శకత్వంలో 'జగదేకవీరుని కథ' మరో జానపద చిత్రం. ఇందులో ఎన్టీఆర్ నటనకు అభిమాన ప్రపంచం నీరాజనాలు పలికింది. రాజుగారి రాజపుండు నయం కావటానికి ఔషధం తెచ్చే యువకుడి సాహసగాథ. ఇందులో పింగళి నాగేంద్రరావు రాసిన ' శివశంకరీ..శివానందలహరి' గీతం అజరామర గీతం. హిందుస్థానీ...దర్బారీ రాగస్పర్శతో పెండ్యాల స్వరపర్చగా ఘంటసాల ఆలాపన. ఈ పాట ప్రేక్షకులను అమితంగా అలరించింది. రామారావు ఈ పాత్రలో తన అభినయంతో ఆకట్టుకున్నారు. మరుసటి ఏడాది పలకరించిన చిత్రం 'గులేబకావళి కథ'. నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించి నటించారు. జమున కథానాయిక. సినారె ఎన్టీఆర్ సినిమాకు తొలిసారి పూర్తిగా సినిమా పాటలు రాసిన చిత్రంగా రికార్డు నమోదయ్యింది.

ఎన్టీరామారావు బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, గండికోట రహస్యం లాంటి చారిత్రక కథాంశాలతో వచ్చిన చిత్రాలలో నటించి అభిమాన ప్రపంచాన్ని అలరించారు. సామాజిక తత్వాన్ని, అవ్యవస్థమీద నిరసనగా వాణి వినిపించిన వీరబ్రహ్మేంద్ర స్వామిగా నటన నభూతో నభవిష్యతి.

ఇదీ చూడండి: పాన్‌ ఇండియా సినిమాలపై కమల్​ ఆసక్తికర కామెంట్స్​

ABOUT THE AUTHOR

...view details