సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పోకిరి. ఎలాంటి కథైనా ఖలేజా చూపుతూ.. తెలుగు సినిమాకు పక్కా బిజినెస్‌మెన్‌లా సరికొత్త మార్కెట్‌ను ఓపెన్ చేసిన ఓవర్సీస్ స్టార్ అతడు. జయాజయాలతో సంబంధం లేకుండా.. సైనికుడులా కష్టపడుతూ.. అవకాశాన్ని దూకుడు చూపుతూ.. శ్రీమంతుడైనా మహర్షిలా పక్కవారికి సాయం చేస్తూ సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేశ్. అయితే ఆయన అభిమానులకు ఈరోజు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేశ్ సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగడానికి ఈరోజే ప్రధానం.
మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరి మనస్సులను దోచుకుంది.. తన సినీ ప్రయాణానికి పునాది పడింది ఈరోజే. దర్శక రత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన 'నీడ' అనే చిత్రంలో తొలిసారిగా మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ గా అదరగొట్టారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కింది. మరోవైపు మహేశ్ బాబు కూడా చక్కగా నటించడంతో ఆ తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆఫర్లు అందుకున్నారు.
బాలనటుడిగా మొత్తం 9 చిత్రాల్లో మహేశ్ బాబు నటించడం విశేషం. అందులో కృష్ణతో కలిసి ఏడు చిత్రాల్లో నటించి మెప్పించాడు. సరిగ్గా 43 ఏళ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు.. చిన్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు.