రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ 'ఎన్‌ఎంఏసీసీ' (నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్)లో సినీ స్టార్స్ సందడి చేశారు. ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ తారలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్యాన్సులతో అలరించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంకచోప్రా, అలియాభట్, రష్మిక తదితరులు పలు సూపర్‌హిట్ పాటలకు డ్యాన్సులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
కాగా, 'పఠాన్' టైటిల్ సాంగ్‌కు షారుక్ ఖాన్ స్టెప్పులేయగా.. హాల్‌లో ఉన్న ప్రముఖులందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. అనంతరం షారుక్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు'కు కూడా డ్యాన్స్ చేశారు. మరోవైపు, ఇదే వేదికపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, 'నేషనల్ క్రష్' రష్మిక 'నాటు నాటు' (హిందీ వెర్షన్)కు డ్యాన్స్ ఇరగదీశారు. ఈ తారల డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఈ వేడుకల్లో సీనియర్ నటి రేఖ, బాలీవుడ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, శ్రద్ధాకపూర్, హృతిక్ రోషన్, నటి సబా అజాద్, కాజోల్, కృతిసనన్, జాకీ ష్రాఫ్ తదితరి సినిమా స్టార్స్ పాల్గొన్నారు. కాగా, భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ.. ఈ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ కల్చరల్ సెంటర్ ప్రారంభించారు.