Niveda pethuraj Bloody mary movie review: చిత్రం: బ్లడీ మేరీ;నటీనటులు: నివేదా పేతురాజ్, అజయ్, బ్రహ్మాజీ, కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి తదితరులు; సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని; సంగీతం: కాల భైరవ; నిర్మాత:టీజీ విశ్వప్రసాద్; రచన: ప్రశాంత్ కుమార్ దిమ్మల; దర్శకత్వం: చందూ మొండేటి; విడుదల:ఆహా
సినిమా అంటే కేవలం థియేటర్ కోసమేనన్న ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు పెరగడం, కరోనాతో థియేటర్లు మూత పడటంతో పలు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. పరిస్థితులు చక్కబడినా ఇంకా ఆ ఒరవడి కొనసాగుతోంది. తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ చిత్రం 'బ్లడీ మేరీ'. నివేదా పేతురాజు కీలక పాత్రలో నటించిన చిత్రమిది. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైంది. మరి సినిమా కథేంటి? ఎలా ఉంది?
కథేంటంటే: మేరీ (నివేదా పేతురాజ్), బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి) అనాథలు. చిన్నప్పటి నుంచి కలిసి, మెలిసి పెరుగుతారు. బాషాకు మాటలు రాకపోయినా నటుడు అవ్వాలన్నది అతడి కల. మరోవైపు రాజుకు వినపడదు. కెమెరామెన్‌గా రాణించాలని అనుకుంటాడు. ఇటు బాష, అటు రాజు ఇద్దరూ సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో మేరీ తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోని డాక్టర్‌నే హత్య చేయాల్సి వస్తుంది. ఇంకోవైపు సినిమా ఆడిషన్ కోసం వెళ్లిన బాషా ఓ స్టూడియోలో హత్య జరగడం చూస్తాడు. ఈ రెండు హత్యలతో మేరీ, బాషా, రాజుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్(అజయ్)కు వీళ్లెలా పట్టుబడ్డారు? జాలరు పేటలో శేఖర్ బాబు (బ్రహ్మాజీ)కి, ఈ కథకు సంబంధం ఏమిటి? హత్య కేసు నుంచి ఈ ముగ్గురూ బయట పడ్డారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: స్థూలంగా చెప్పాలంటే ‘బ్లడీ మేరీ’ ఒక క్రైమ్ థ్రిల్లర్. కానీ, రెగ్యులర్ కమర్షియల్ మూవీలకు కాస్త భిన్నంగా రచయిత ప్రశాంత్, దర్శకుడు చందూ మొండేటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలు ముప్పేట దాడి చేసినప్పుడు ఒక తెలివైన అమ్మాయి ఆ పరిస్థితులను తనకు ఎలా అనుకూలంగా మార్చుకున్నదనేది చక్కగా చూపించారు. అనాథ శరణాలయంలో చిన్నారుల అపహరణ, ఆ తర్వాత డాక్టర్‌ను మేరీ హత్య చేయటం, బాషా మరో హత్యను చూడటంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తిని ప్రేక్షకుడిలో రేకెత్తించాడు దర్శకుడు. ఎప్పుడైతే కథలోకి సీఐ ప్రభాకర్(అజయ్) ప్రవేశించాడో అప్పటి నుంచి కథ మలుపులు తిరుగుతూనే ఉంటుంది. మేరీ, బాషా, రాజులు పోలీసులకు చిక్కినట్లే అనిపించినా, మేరీ తన తెలివి తేటలతో ఎత్తుకు పైఎత్తులు వేసి తప్పించుకునేలా చేస్తుంది. బాషా, రాజులకు లోపం ఉన్నట్లే మేరికి కూడా ఓ లోపం ఉంటుంది. అయితే, ఆ లోపాలను కారణం చూపించి, ఆ పాత్రలపై కామెడీ చేయటం కానీ, సానుభూతి ఏర్పడేలా చేయటం కానీ దర్శకుడు చేయలేదు.
సినిమా ప్రథమార్ధంలో ఆసక్తిగా అనిపించినా, సీఐ ప్రభాకర్‌ను డామినేట్ చేసేందుకు మేరీ వేసే ఎత్తులు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. రౌడీ షీటర్ శేఖర్‌బాబు దగ్గర చిక్కుకుపోయిన సమయంలోనూ మేరీ అదే ఫార్ములాను ఉపయోగిస్తుంది. దీని వల్ల మేరీ ముందు మిగిలిన పాత్రలు వెలవెలబోయాయి. ప్రతి సన్నివేశంలోనూ మేరీదే పైచేయి అన్నట్లు చూపించటం కూడా ఆ పాత్ర కోసం దర్శక-రచయితలు మరింత లిబర్టీ తీసుకున్నారేమో అనిపిస్తుంది.పతాక సన్నివేశాల్లో మేరీ పాత్ర ఎలివేషన్ మరీ డామినేటింగ్‌గా ఉంది. కథ, కథనాల పరంగా చిన్న చిన్న ట్విస్ట్‌లతో సినిమాను నడపించారు. క్రైమ్ థ్రిలర్ చూడాలనుకునేవారికి ‘బ్లడీ మేరీ’ టైమ్ పాస్. నిడివి కూడా తక్కువే. పతాక సన్నివేశాల్లో ఓ ట్విస్ట్‌అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎవరెలా చేశారంటే: మేరీ పాత్రలో నివేదా పేతురాజు చక్కగా నటించింది. అయితే, ఆ పాత్రను ఎక్స్‌ట్రీమ్ తెలివి తేటలతో తీర్చిదిద్దడమే కాస్త వాస్తవానికి దూరంగా ఉంటుంది. కిరీటి, రాజ్‌కుమార్, అజయ్, బ్రహ్మాజీలు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. రచయిత ప్రశాంత్ అనుకున్న కథను చందూ తనదైన శైలిలో తెరకెక్కించారు. కథ, కథనాలను నడిపిన తీరు బాగుంది.
బలాలు
+ నటీనటులు