అది 'తిరుచిత్రంబలం' సినిమా ఆడియో విడుదల వేడుక. చిత్ర బృందంలో చాలామంది రెడ్ కార్పెట్ వేదికగా ప్రాంగణంలోకి వస్తూ అభిమానుల్ని హుషారెత్తించారు. అదే కార్పెట్‌పై నటి నిత్యా మేనన్ వీల్ ఛైర్‌లో రావడం విస్మయానికి గురిచేసింది. సంబంధిత ఫొటోని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆమెకు ఏం జరిగిందోనన్న సందేహం తలెత్తింది. 'నిత్యకు ఏమైంది?', 'ఎందుకు వీల్ ఛైర్‌లో ఈవెంట్‌కు వచ్చారు?' అంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే.. తమ ఇంట్లో నడుస్తున్నప్పుడు జారి పడటం వల్ల నిత్య చీలమండకు గాయమైంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకున్నారు. గాయం కొంచెం మెరుగుపడిందని, నెమ్మదిగా నడుస్తున్నానని నిత్య ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. దీంతోపాటు తన పెళ్లిపై వచ్చిన వదంతులను ఆమె ఖండించారు. మరోవైపు, 'మోడర్న్ లవ్: హైదరాబాద్' అనే వెబ్ సిరీస్‌లో స్టిక్ సహాయంతోనే నడవగలిగే అమ్మాయి పాత్రను పోషించడం యాదృచ్ఛికమని తెలిపారు. ఈ సిరీస్ ఈవెంట్‌లోనూ నిత్య స్టిక్ పట్టుకుని నడవడం చాలామందిని కంగారు పడేలా చేసింది.