రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజలు ఒక సినిమాపై చూపించే ప్రేమాభిమానాలు ఆ సినిమాకు ఆస్కార్ కంటే గొప్పవన్నారు.
ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ..''నన్ను క్షమించండి. నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరు ఆస్కార్‌ను ఇష్టపడతారు. కానీ ఒక సినిమాకు అతి పెద్ద విజయం ఏంటంటే అది ప్రజల నుంచి ప్రేమ, ప్రశంసలను పొందడమే. అదే అతి పెద్ద అవార్డు''అన్నారు.
''ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు 'ఆర్‌ఆర్‌ఆర్'ను ఎంతో ఆదరించారు. అదే ఈ చిత్రానికి పెద్ద విజయం. మరి.. మనకిక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు..ఇలా మన సొంత అవార్డులు ఉన్నాయి. నేను అస్కార్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వను. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి.. అసలు మనకు అస్కార్ నుంచి సర్టిఫికేట్ ఎందుకు? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. విడుదలైన అన్నిచోట్లా భారతీయ సినిమాలు దూసుకుపోతున్నాయి. నేను స్పెయిన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' చూశాను. థియేటర్‌లు అన్ని హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. స్పానిష్ ప్రజలు సినిమా చూడడానికి మళ్లీ మళ్లీ సినిమా హాలుకు వస్తున్నారు. ఇక, మనకు ఆస్కార్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు'' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇదీ చూడండి:విలన్‌గా అల్లరోడి అన్న.. ఆ బడా డైరెక్టర్‌తో సినిమా!