రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'. భారతీయ సినీ అభిమానులనే కాదు, హాలీవుడ్ ప్రేక్షకులూ ఈ మూవీకి ఫిదా అయ్యారు. ఈ క్రమంలో హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. ఈ జాబితాలో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా చేరారు.
'తారక్.. చిన్న కరెక్షన్'.. ఎన్టీఆర్ విషెస్‌కు రాజమౌళి రిప్లై వైరల్.. ఫ్యాన్స్ ఖుష్ - రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ అవార్డు
దర్శకుడు రాజమౌళికి 'ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' అవార్డు వచ్చిన సందర్భంగా కథానాయకుడు ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. దీనికి రాజమౌళి ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.

రాజమౌళికి అవార్డు వచ్చిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, 'అభినందనలు జక్కన్న. మీ కీర్తి ప్రపంచవ్యాప్తంకావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ల మన జర్నీలో మీ గురించి నాకు తెలిసినదంతా ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది' అని ట్వీట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ, 'హహ్హహ్హ.. తారక్ చిన్న కరెక్షన్. ఇది మన ప్రయాణానికి ఆరంభం' అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా 'ఆర్ఆర్‌ఆర్' తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.