జూన్, జులై... కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నెలలు. కొత్త తరగతులు, పుస్తకాలు, ఆశలు, లక్ష్యాలతో విద్యార్థులు స్కూళ్లు కాలేజీలకి పరుగులు పెట్టే సమయం. అదే తరహాలోనే మన కథానాయకులూ ఈ నెల నుంచి కొత్త సినీ అధ్యాయాల్ని మొదలు పెట్టనున్నారు. విజయోత్సాహంతో కొంతమంది... పలు సినిమాలతో బిజీగా గడుపుతూనే, మరో సినిమా కోసం కొద్దిమంది కొత్త సెట్స్‌పైకి రానున్నారు. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య, వరుణ్‌తేజ్ తదితర కథానాయకుల సినిమాలు ఈ నెలలోనే మొదలు కానున్నాయి. ప్రభాస్, రామ్‌ల చిత్రాలూ క్లాప్ కొట్టుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'సర్కారు వారి పాట'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్టులకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో. 'అతడు', 'ఖలేజా' తర్వాత ఆ ఇద్దరి కలయికలో రానున్న సినిమా ఇది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి జూన్ నెలలోనే క్లాప్ కొడతారు. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ని పక్కా చేసేశారు.
'భీమ్లానాయక్' సినిమాతో సందడి చేసిన పవన్ కల్యాణ్... 'హరి హర వీర మల్లు'తో బిజీగా గడుపుతున్నారు. దాంతోపాటుగా మరికొన్ని చిత్రాలు ఉన్నప్పటికీ..కొత్తగా ఇంకో కథకి పచ్చజెండా ఊపారు. తమిళంలో విజయవంతమైన 'వినోదాయ సిద్ధం' రీమేక్‌లో నటించనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు జూన్‌లోనే షురూ కానున్నట్టు సమాచారం. ఇందులో సాయి తేజ్ నటిస్తారు.