తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్​లో కొత్త అందాల సందడి.. 2023లో హిట్టు కొడతారా? - గాయత్రి భరద్వాజ్‌ అప్​కమింగ్ ప్రాజెక్ట్స్

గతేడాది తెలుగు తెరపై కొత్త సోయగాల సందడి బాగానే కనిపించింది. పరభాషా నాయికలతో పాటు పలువురు విదేశీ భామలు సైతం తెలుగు తెరపై అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ, అందులో హిట్టు మాట వినిపించి.. సత్తా చాటింది కొందరే. 2023లోనూ తెలుగు తెరపై మెరవనున్న కొత్త అందాల జాబితా పెద్దగానే ఉంది. అందులో పలువురు ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసుకొని సినీప్రియుల ముందుకొచ్చేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. మరికొందరు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు. మరి ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న ఆ కొత్త భామలెవరు? వారి చిత్ర విశేషాలేంటి? ఓ లుక్కేద్దాం పదండి..

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 13, 2023, 7:14 AM IST

తెలుగులో కొత్త అందాల సందడి ఈ ఏడాది ఆరంభం నుంచే గట్టిగా కనిపించనుంది. సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోంది 'కల్యాణం కమనీయం'. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన చిత్రమిది. అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించారు. ఈ సినిమాతోనే తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది కన్నడ కస్తూరి ప్రియ భవానీ శంకర్‌. ఇందులో శ్రుతిగా నటనా ప్రాధాన్యమున్న పాత్రతో సందడి చేయనుంది ప్రియా. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియ ప్రస్తుతం తెలుగులో సత్యదేవ్‌కు జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో 'ఇండియన్‌2', 'పాతు తలా', 'రుద్రన్‌' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.

ప్రియ భవానీ శంకర్​

గతేడాది వచ్చిన 'ది ఘోస్ట్‌' చిత్రంలో నాగార్జునకు మేనకోడలుగా నటించి, మెప్పించింది అనిక సురేంద్రన్‌. ఈ చిన్నది ఇప్పుడు నాయికగా 'బుట్టబొమ్మ'తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించారు. అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ కీలక పాత్రలు పోషించారు. ప్రేమలోని పలు సున్నితమైన పార్వ్శాలను స్పృశిస్తూ సాగే ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా కనువిందు చేయనుంది అనిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.

మాళవిక, నూపుర్​

ప్రస్తుతం కన్నడ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ.. జోరు చూపిస్తోన్న నాయిక ఆషికా రంగనాథ్‌. ఆమె ఇప్పుడు 'అమిగోస్‌'తో తెలుగు తెరకు పరిచయమవుతోంది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కొత్త దర్శకుడు రాజేందర్‌ రెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఆసక్తికర కథతో రూపొందింది. ఇందులో కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నారు.

ఇషికా అనే పాత్రతో ఆషికా అలరించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న విడుదల కానుంది. మోడల్‌గా ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి యువతరంలో క్రేజ్‌ సంపాదించుకున్న భామ సాక్షి వైద్య. ఆమె ప్రస్తుతం 'ఏజెంట్‌'తో వెండి తెరపైకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వేసవికి విడుదల కానుంది.

వీళ్లూ వచ్చేస్తున్నారు..
ఉత్తరాదిలో చెరో చిత్రం చేసి.. ఇప్పుడు తెలుగు సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌. ఇప్పుడీ ఇద్దరూ కథానాయికలుగా నటిస్తున్న చిత్రమే 'టైగర్‌ నాగేశ్వరరావు'. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వంశీ తెరకెక్కిస్తున్నారు. 1970 స్టువర్టుపురం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ కాలంలో అక్కడ పేరు మోసిన ఓ దొంగ జీవిత కథతో రూపొందుతోంది. ఈ సినిమాతోనే తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నూపుర్‌, గాయత్రి. మరి ఈ సినిమాతో వీళ్లు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

ఆశికా, అనికా

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ అనువాద చిత్రం 'మాస్టర్‌'తో మెప్పించిన నాయిక మాళవికా మోహనన్‌. ఆమె ఇప్పుడు ప్రభాస్‌ సినిమాతో తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు నాయికలు కనిపించనుండగా.. ఓ పాత్ర కోసం మాళవికాను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం నాయికగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details