akhil venu sriram new movie: కరోనా విరామంలో చాలామంది హీరోలు రెండు మూడు కథలు పక్కా చేసి పెట్టుకున్నారు. వాటితోనే ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. కొంతమంది తారలు మాత్రం మా దగ్గర మరో కథకు చోటుందనే సంకేతాలు పంపుతున్నారు. వాళ్లనే టార్గెట్ చేసుకుంటున్న దర్శకులు తగిన కథలు సిద్ధం చేసి వినిపిస్తున్నారు. పూర్తిస్థాయి స్క్రిప్టులు నచ్చడంతోపాటు, మిగతా సమీకరణన్నీ కుదిరితే ఆయా కలయికల్లో సినిమాలు దాదాపుగా ఖాయమైనట్టే అనేది పరిశ్రమలో వినిపిస్తున్న మాట. కొన్ని కలయికలు ఇప్పటికే ఖరారు కావడంతో స్క్రిప్టు పనులతో దర్శకులు బిజీ బిజీగా గడుపుతున్నారు.
కొన్నాళ్లుగా చిత్రసీమలో అఖిల్ అక్కినేని - శ్రీరామ్ వేణు కలయిక గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. 'వకీల్‌సాబ్'తో సత్తా చాటిన శ్రీరామ్ వేణు మళ్లీ దిల్‌రాజు సంస్థలోనే సినిమా చేయడం కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ కథని అఖిల్‌కి వినిపించి, సినిమాని పట్టాలెక్కించాలనేది నిర్మాత దిల్‌రాజు ఆలోచనగా తెలిసింది. దీనికి 'తమ్ముడు' అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. సాయితేజ్-సంపత్ నంది కలయికలో సినిమాకి స్క్రిప్టు ముస్తాబవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆ సినిమా రూపొందనుంది. సాయితేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాతోపాటు, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం పూర్తయ్యాక.. సంపత్ నంది సినిమా కోసమే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.
నితిన్- సాగర్ కె.చంద్ర, వరుణ్‌తేజ్ - సుజీత్ కాంబినేషన్‌ల స్క్రిప్టులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌తో 'భీమ్లానాయక్'ని తెరకెక్కించిన సాగర్ కె.చంద్ర ఈసారి ఓ యాక్షన్ కథతో సినిమా చేయనున్నట్టు తెలిసింది. కథని ఆయన ఇప్పటికే నితిన్‌కి వినిపించారని టాక్. ప్రభాస్‌తో 'సాహో' తెరకెక్కించిన సుజీత్ నుంచి ఈ ఏడాదిలోనే కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. 'లూసిఫర్', 'తేరి' రీమేక్‌ల విషయంలో సుజీత్ పేరు బలంగా వినిపించింది. అయితే తాజాగా ఆయన వరుణ్‌తేజ్ కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కలయిక గురించి స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.