శ్రీ రామ నవమి సందర్భంగా విడుదలైన 'ఆదిపురుష్' మూవీ కొత్త పోస్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. గతేడాది వచ్చిన టీజర్‌తో విమర్శలు ఎదుర్కొన్న 'ఆదిపురుష్' టీమ్.. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో మరోసారి విమర్శలపాలైంది. ఈ కొత్త పోస్టర్ చూసి మరింత నిరాశకు లోనయ్యామని.. దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లే ఇంకా బాగున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాను ఎలా తీయాలని ప్లాన్ చేశారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాలో పాత్రలను చిత్రీకరించిన విధానం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
గురువారం రిలీజైన పోస్టర్ కూడా అంతగా ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు. 'రూ.500 కోట్లు పెట్టి యానిమేటేడ్ మూవీ తీస్తారా'. 'ఇంతకు ముందుకి.. ఇప్పటికీ ఏ మాత్రం ఇంప్రూవ్‌మెంట్ లేదుగా'. అప్పుడున్న పోస్టర్‌కు కాస్త ఫిల్టర్ ఉపయోగించినట్లు ఉంది. అంతేకానీ ఆర్ట్ వేసినట్లు లేదు'. 'ఎందుకు రూ.500 కోట్లు వృథా చేస్తున్నావు ఓం రౌత్'. 'దీనికంటే చిన్న సినిమా హనుమాన్ వీఎఫ్‌ఎక్స్ బావున్నాయి' అంటూ నెట్టింట తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గతంలోనూ ఈ సినిమా వీఎఫ్ఎక్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా కోసం ఉపయోగించిన గ్రాఫిక్స్ అంతంత మాత్రంగా ఉందని.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇలాంటి గ్రాఫిక్స్ వాడి.. స్టోరీని దెబ్బతీస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహించారు. 'ఈ సినిమాను యానిమేషన్లో తీస్తున్నారా' అంటూ ప్రశ్నించారు. దీంతో మరోసారి సినిమా మెత్తానికి మెరుగులు దిద్దేందుకు రంగంలోకి దిగారు దర్శకుడు ఓం రౌత్. అయినప్పటికీ తాజాగా రిలీజైన పోస్టర్లో ఆ మార్పులు ఏం కనిపించలేదంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఇక హనుమంతుని పాత్రలో దేవదత్త గజానన్ నాగే నటిస్తున్నారు. మరోవైపు లంకేశునిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 16న రిలీజ్ కానుంది.