బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. సీజన్2లో భాగంగా ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇటీవల ఈ షోకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఆహా కొత్త టీజర్‌ను విడుదల చేసింది.
అన్‌స్టాపబుల్ పవన్ ప్రోమో రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న బాలయ్య ప్రశ్నలు! - ఎన్‌బీకే అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎన్‌బీకే అన్‌స్టాపబుల్ పవన్ కల్యాణ్ ప్రోమో రిలీజయ్యింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు. వాటితోపాటు పవన్‌ను బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. 'మీ అన్నయ్య చిరంజీవి నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నది ఏంటి?' అంటూ పవన్‌ను బాలకృష్ణ అడిగారు. ఆ సమయంలో పవన్ సీరియస్‌గా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 'రాష్ట్రంలో నీకు అభిమాని కానీ వారెవ్వరూ లేరు అయినా కూడా ఆ అభిమానం ఓట్ల రూపంలో మారలేదు ఎందుకు?' అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కూడా పవన్ ఆసక్తికరంగా సమాధానం చెప్పినట్లు ప్రోమోలో చూడవచ్చు.
మొత్తానికి అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్‌పై ఈ ప్రోమో ఆసక్తి పెంచుతోంది. అయితే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తోంది.