NBK 107 Movie: బాలకృష్ణ కథానాయకుడిగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. కీలకమైన పోరాట ఘట్టాల చిత్రీకరణ కోసం మరోసారి కదనరంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ.
మంగళవారం కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో.. ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. సిరిసిల్లలో ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది. విదేశీ నేపథ్యమూ ఇందులో ఉంటుందని సమాచారం.