Nayanthara Vignesh Shivan Wedding Promo: అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నటి నయనతార. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న నయన్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది నయన్‌కు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. తన ప్రియుడు, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. వీరి లవ్‌స్టోరీపై డాక్యుమెంటరీని తీసిన నెట్‌ఫ్లిక్స్ సంబంధిత ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నయన్, విఘ్నేశ్ తమ ప్రేమను చాటుకున్నారు. త్వరలోనే ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ నుంచి పెళ్లిదాకా నయన్-విఘ్నేశ్‌ల బంధంపైన తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్.
చాలాకాలం పాటు ప్రేమాయణం సాగించిన ఈ జోడీ 2022 జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్టులో పెళ్లి చేసుకుని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై సర్వహక్కులను భారీ మొత్తంలో వెచ్చించి దక్కించుకుంది నెట్‌ఫ్లిక్స్. పెళ్లి ఏర్పాట్లకు కూడా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యమే డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు షారుక్ ఖాన్, రజనీకాంత్, ఏఆర్ రహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
చైతూతో రష్మిక..? నాగచైతన్య కథానాయకుడిగా పరుశురామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, రష్మికకు పరుశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. గతంలో పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీతగోవిందం'లో రష్మిక సందడి చేసింది. ఇప్పుడు నాగచైతన్య పక్కన రష్మిక ఓకే అయితే, తొలిసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. ఈ కొత్త జంటపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.