తన నటన, అందం, అభినయంతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది కథానాయిక నయనతార. గతేడాది నటుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లల కూడా తల్లైంది నయన్. అటు వైవాహిక జీవితంలో.. ఇటు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న నయన్‌పై.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రేమ కథ ఎలా మొదలైందో మొదటి సారి ప్రేక్షకులతో పంచుకున్నారు. 'నేనూ రౌడీనే' అనే చిత్రం మొదలు కావడానికి కంటే ముందే తాను నయనతారతో ప్రేమలో పడినట్లు చెప్పారు. కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కొంటోన్న రోజుల్లోనే తన లవ్‌స్టోరీ మొదలైందని తెలిపారు.
'నయన్‌తో ప్రేమ అలా మొదలైంది.. 'మేడమ్'తో అప్పుడే లవ్‌లో పడిపోయా' - నయనతార నేను రౌడీనే సినిమా
అటు పర్సనల్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో బీజీ బీజీగా గడుపుతోంది 'లేడీ సూపర్ స్టార్' నయనతార. తాజాగా నయన్‌తో తన ప్రేమ కథ ఏలా మొదలైందో వివరించారు.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్. ఓ సమయంలో ఆ విషయంలో ఆమె అంగీకరించదని అనుకున్నానని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..
'ఆమె అంగీకరించదు అనుకున్నా..'
''పోడాపోడి' అనే తమిళ సినిమా బోల్తా కొట్టడం వల్ల ప్రేక్షకుల్లో నాపై ఓ అభిప్రాయం వచ్చేసింది. దాన్నుంచి బయటపడాలని.. కెరీర్‌లో మంచి హిట్ సినిమాలు తీయాలని ఎంతో శ్రమించాను. కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కొంటోన్న సమయంలో 'నేనూ రౌడీనే' కథ రాసుకున్నా. నా దగ్గర కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుష్.. ఆ సినిమాను తానే నిర్మిస్తానని ముందుకు వచ్చారు. నయన్ కలిసి కథ చెప్పమన్నారు. అయితే, ఆమె ఈ కథ అంగీకరించదని అనుకుని.. హీరోయిన్ నజ్రియాతో మాట్లాడదామని అనుకున్నా. కానీ, ధనుష్ మాటను కాదనలేక.. నయనతారను కలిశాను. ఆమె నన్ను చాలా గౌరవించింది. ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా. 'నేను రౌడీనే' సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ నుంచే మేమిద్దరం డేటింగ్ స్టార్ట్ చేశాం. మేమిద్దరం ప్రేమలో ఉన్న సంగతి.. మేము చెప్పే దాకా ఎవరికీ తెలియలేదు. సినిమా సెట్‌లో ఆమెను మేడమ్ అనే పిలిచేవాడిని. ఆఖరికి నయన్ కారవ్యాన్‌లోకి కూడా వెళ్లేవాడిని కాదు. మేము వృత్తిపట్ల అంత గౌరవంగా ఉంటాం.''
'ట్రైన్ జర్నీ.. వాళ్లు అలా అనుకున్నారు'
''నాకు, నయన్‌కు సింపుల్‌గా ఉండటమే ఇష్టం. ఇటీవల మేమిద్దరం ట్రైన్‌లోనూ జర్నీ చేశాం. కానీ అందరూ దాన్ని పెద్ద విషయంగా చూశారు. మా కులదైవాన్ని దర్శనార్థం నేనూ, నయన్ తిరుచ్చి వెళ్లాం. అక్కడి నుంచి ఫ్లైట్‌లో రిటర్న్ అయితే ఇంటికి చేరే సరికి అర్ధరాత్రి అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలను ఇంట్లోనే ఉంచి వచ్చాం. ఫ్లైట్ కోసం వేచి ఉండే బదులు రైలు ప్రయాణం మేలని.. ట్రైన్ ఎక్కేశాం. మమ్మల్ని చూసి ప్రయాణీకులు ఆనందంతో కేకలు వేశారు. ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అది వాళ్ల ప్రేమాభిమానం. నేను అర్థం చేసుకోగలను. కానీ, కొన్ని పరిస్థితుల్లో వాళ్లను ఎలా అదుపు చేయాలో కూడా నాకు అర్థం కాదు'' అని విఘ్నేశ్ శివన్ తన ప్రేమ కథను వినిపించారు.