భార్య తనపై చేసిన ఆరోపణలను ఖండిచారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. మీడియాలో జరిగే డ్రామా.. తన పిల్లలు చదవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. తన గురించి సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలిపారు. అవి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా చేసినవని చెప్పారు. ఈ మేరకు నవాజుద్దీన్ సోషల్ మీడియా వేదికంగా ప్రకటించారు. "నేను మౌనంగా ఉండటం వల్ల.. అన్ని చోట్ల నన్ను ఓ చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించారు. ఈ ఘటనపై స్పందిస్తే.. మీడియాలో జరిగే తమాషా ఎక్కడ నా పిల్లలు చదువుతారో అనే కారణంతో నేను మౌనంగా ఉన్నాను. ఏక పక్షంగా చెప్పిన విషయాలు, తప్పుడు వీడియోల వల్ల నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ప్రెస్‌తో పాటు మరి కొందరు ఎంజాయ్ చేస్తున్నారు" అని ట్విట్టర్లో పోస్టు చేశారు.
'ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది.. నా పరువు పోతే వారికి ఆనందం' - నవాజుద్దీన్ సిద్ధిఖీకి భార్యతో గొడవలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తనపై తన భార్య చేసిన ఆరోపణలను ఖండిచారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికే ఆమె ఇలా చేస్తోందని చెప్పారు. తన పిల్లల భవిష్యత్ కోసం తాను ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధం అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
కాగా, తన భార్య ఆలియాతో కలిసి ఉండటం కుదరదని.. తాము ఇప్పటికే విడాకులు తీసుకున్నామని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పారు. దీంతో పాటు ఆలియాపై పలు విమర్శలు చేశారు. నాలుగు నెలల క్రితం దుబాయ్‌లో పిల్లలను వదిలి వచ్చేసిందని.. ఇప్పుడు డబ్బుల కోసం వారిని మళ్లీ తీసుకువచ్చిందని ఆరోపించారు. తన పిల్లలు 45 రోజుల పాటు స్కూలు దూరమయ్యారని అన్నారు. "ఆలియా పిల్లలను ఈ డ్రామాలోకి తీసుకొచ్చింది. ఇదంతా కేవలం నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి, నా పరువు తీయడానికి, నా కేరీర్‌ను నాశన చేయడానికే. దీంతో పాటు తన అన్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానిక మాత్రమే ఆలియా ఇలా చేస్తోంది. కానీ నేను సంపాదించేదంతా నా పిల్లల కోసమే. నేను నా పిల్లలు షోరా, యానిని ప్రేమిస్తున్నాను. వారి శ్రేయస్సు కోసం, వాళ్ల భవిష్యత్‌కు భద్రత కల్పించడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ముందుకు సాగుతాను" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ రాసుకొచ్చారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా.. తమ మధ్య ఉన్న విభేదాలను.. వాళ్ల పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గత నెలలో ముంబయి హైకోర్టు సూచించింది. కాగా, అంతకుముందు తన పిల్లల ఆచూకీ తెలపాలంటూ.. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నవాజుద్దీన్ సద్ధిఖీ. కాగా, ఇటీవలే ఆలియా నవాజుద్దీన్‌పై ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసి.. అందులో నవాజుద్దీన్ తన పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశారని.. అర్ధరాత్రి పిల్లలతో తాను రోడ్డున పడ్డట్లు చెప్పుకొచ్చింది. తన పిల్లలు ఏడుస్తున్నారని.. రూ. 81 లతో ఎక్కడికి పోవాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆ విడీయో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ స్పందించారు.