బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'దసరా' సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ మేకింగ్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ సెట్స్‌లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేశ్‌తో పాటు ఇతర ఆర్టిస్టులు కూడా చాలా డెడికేషన్‌తో సినిమా కోసం కష్టపడ్డారంటూ ప్రశంసిస్తున్నారు. దీని ఫలితమే మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడానికి కారణం అని అంటున్నారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో టెక్నీషియన్ల దగ్గర్నుంచి ఆర్టిస్టుల వరకు సెట్లోని దుమ్ము, ధూళిని సైతం లెక్కచేయకుండా క్యారెక్టర్లలో లీనమై నటించినట్టుగా కనిపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మేకింగ్ వీడియో వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
మార్చి 30న విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌ను అందుకున్న 'దసరా' ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. ఇక రానున్న వీకెండ్లో కూడా దీని కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాచురల్ స్టార్ నాని ఇప్పటివరకు నటించిన సినిమాల్లో 'దసరా' ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. 'దసరా'ను తెరకెక్కించిన ఈయన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టేశారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిందీ చిత్రం.
కాగా, నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేశ్‌తో పాటు హీరో నాని కూడా పక్కా మాస్ లుక్‌లో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా మొత్తం 5 భాషల్లో విడుదల చేశారు. ధరణి పాత్రలో నాని, వెన్నెల క్యారెక్టర్లో కీర్తిసురేశ్ యాక్టింగ్ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాను చూసిన అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం సోషల్‌మీడియా వేదికగా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే వైవిధ్యమైన కథతో మొదటి సినిమాతోనే విజయం అందుకున్న శ్రీకాంత్ ఓదెలను.. టాలీవుడ్‌కు మరో అద్భుతమైన దర్శకుడు దొరికాడంటూ సినీ ప్రియులు అంటున్నారు.
'దసరా'ను వాటితో పోల్చిన నాని!
బాక్సాఫీస్ వద్ద ఆశించిన దాని కంటే అధిక వసూళ్లను సాధిస్తోంది దసరా. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించిన సినిమాల జాబితాలోకి చేరింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు చాలా రోజుల ముందే.. ఈ సినిమాను కేజీయఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పోల్చారు నాని. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. 'దసరా' కూడా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందని అన్నారు. దీంతో నాని మూవీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో దీనిపై నానికి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ కామెంట్స్ చేశానని నాని వివరణ ఇచ్చారు.