National Film Awards 2021 : భారతీయ చలనచిత్ర రంగం ఎంతగానో ఎదురుచూసిన 69 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2021కు గాను సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఉత్తమ నటిగా ఆలియా భట్, కృతిసనన్ ఎంపికయ్యారు.
ఆర్ఆర్ఆర్కు అవార్డుల పంట..
RRR National Fim Awards :మరోవైపు పుష్ప-1తో పాటు 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు అవార్డుల వెల్లువ కొనసాగింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), ఉత్తమ నేపథ్య గాయకుడు, స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్ కొరియోగ్రాఫర్ ఇలా ఆరు కేటగిరీల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా అవార్డులు అందుకుంది. ఇక ఉత్తమ తెలుగు సినిమాగా 'ఉప్పెన' ఎంపికవ్వగా.. ఉత్తమ హిందీ చిత్రంగా 'సర్దార్ ఉద్ధమ్', ఉత్తమ గుజరాతీ చిత్రం 'ఛల్లో షో', ఉత్తమ కన్నడ చిత్రంగా '777 చార్లీ', ఉత్తమ మలయాళీ చిత్రంగా 'హోమ్' సినిమాలకు అవార్డులు ప్రకటించారు. 'కొండపొలం' సినిమాకు పాటలు రాసిన చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు.