కొత్త సంవత్సరం 'తియ్యని వేడుక చేసుకుందాం'.. ప్రస్తుతం ఇది సీనియర్ నటుడు నరేశ్-నటి పవిత్ర లోకేశ్‌కు సరిగ్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా తమ రిలేషన్షిప్ గురించి అధికారికంగా ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్తో పాటు షాక్‌కు గురిచేశారు. ఎందుకంటే ఎన్నో వివాదాలు, విమర్శల నడుమ సీక్రెట్‌గా సాగిన వీరి రిలేషన్షిప్ టాలీవుడ్-2022లో హాట్ టాపిక్‌గా నిలిచింది. నరేశ్-అతడి మూడో భార్య రమ్య- పవిత్ర- పవిత్ర భర్త.. మీడియా ముందుకు వచ్చి ఒకరి గురించి ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన వీళ్ల గురించే చర్చ. వార్తల్లో బాగా ట్రెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పి తమ పెళ్లి ప్రకటనతో అందరిని షాక్‌కు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే అసలు మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఎక్కడ చూసినా వీళ్లే..నరేశ్-పవిత్రా.. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో జంటగా నటించారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తున్నారని, వివాహం చేసుకోబోతున్నారని కొంత కాలం నుంచి జోరుగా ప్రచారం సాగింది. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే అనేక కథనాలు వచ్చాయి. ఈ పుకార్లకు ఊతం ఇస్తూ.. నరేశ్-పవిత్రా.. పలు ప్రైవేట్ ఈవెంట్లతో పాటు గుడి గోపురాల్లో కనిపించడం వల్ల.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఊపందుకుంది.
ఈ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నరేశ్ పెళ్లి గురించి మాట్లాడుతూ... "సినిమా వాళ్ల పెళ్లిళ్లు బయటికి కనిపిస్తాయి, మిగతా వాళ్లవి కనిపించవు. పెళ్లి అనేది ఆట కాదు. అది ఒక జీవితం. లైఫ్‌లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే అందులో నుంచి బయటకు వస్తారు. భవిష్యత్‌లో మ్యారేజ్ వ్యవస్థ ఉండకపోవచ్చు. ఓ నటుడికి స్థిరత్వం ఉండదు. సమయానికి ఇంటికి రారు. నేను నెలలో 28 రోజులు షూటింగ్లలో ఉంటాను. ఇప్పటికీ నా మొదటి భార్య సినిమానే. నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునే వారితోనే కలిసి జీవించగలను" అని నరేశ్ అన్నారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
మూడో భార్యకు విడాకులు.. ఈ నేపథ్యంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కర్ణాటకలో పవిత్ర-నరేశ్ వ్యవహారంపై స్పందించారు. ''నరేశ్‌తో నాకు సత్సంబంధాలు లేవు. నాకు ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. మ్యారేజ్ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఆయనకు మ్యారేజ్ అయితే నా పరిస్థితి ఏంటి?.. పవిత్రతో పెళ్లైంది కాబట్టే ఆయన అలా అన్నారు. నరేశ్ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మూడేళ్ల నుంచి మా మధ్య విభేదాలున్నాయి. న్యాయపరంగా విడాకులు తీసుకోవడమనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకు సమయం పడుతుంది. ఈ ఏడాది జనవరిలోనే నరేశ్ నాపై కేసు పెట్టారు. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా. నోటీసులు నా వరకు రాకుండా గేటు దగ్గర నుంచే వెనక్కి పంపారు. దేవుడి దయ వల్ల జూన్‌లో పోస్టు మాస్టర్ నా నంబర్‌కు కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు సమన్లు అన్నీ బెంగళూరు అడ్రస్‌కు పంపమని కోరా. నాకు పంపిన సమన్లపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. త్వరలో దీనిపై స్పందిస్తా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది'' అని అన్నారు.
ఖండించిన నరేశ్.. అయితే రమ్య రఘుపతి చేసిన ఆరోపణలను నటుడు నరేశ్ ఖండిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ''రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదు. బెంగళూర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ నాపై వదంతులు సృష్టిస్తోంది. రూ.50 లక్షల కోసం నా ఇంట్లో వాళ్లను రమ్య పీడించింది. ఆమెకు విడాకుల నోటీసు పంపి నెల రోజులు దాటింది. విడాకుల నోటీసు పంపిన తర్వాత నాకు పెళ్లి కాబోతోందని రూమర్స్ క్రియేట్ చేసింది. కన్నడ మీడియాలో ఆ అంశంపై పూర్తి వివరణ ఇచ్చా. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరం. ఈ వివాదంలోకి పవిత్ర లోకేశ్‌ను ప్రస్తావిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడం చాలా తప్పు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో నేను ఎంతోమంది హీరోయిన్స్‌తో కలిసి పనిచేశా. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నాకు గతంలో పెళ్లిళ్లు అయి ఉండొచ్చు. వాళ్లే నన్ను వదిలేసి వెళ్లిపోయారు. అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే నేను రాజకీయాలు, సామాజిక సేవలో ఎంతో బిజీ జీవితం గడిపా. రమ్య రఘుపతి నా జీవితాన్ని నాశనం చేశారు'' అని అన్నారు.