Nani Vivek Athreya New Movie : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశారు. తనతో 'అంటే సుందరానికి' లాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయతోనే మరో చిత్రాన్ని చేయనున్నారు. వాస్తవానికి ఈ విషయం చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉండగా తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. నాని 31వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో నానిపై షూట్ చేస్తున్నట్లు చూపించారు.
'ది మోస్ట్ లవ్‌బుల్ కాంబో ఆఫ్ అవర్ నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబో ఈజ్ బ్యాక్' అంటూ రాసుకొచ్చారు. అక్టోబర్ 24న సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని, ఆ రోజే ముహూర్తం షాట్ అని చెప్పుకొచ్చారు. ఈ సారి థ్రిల్స్, చిల్స్, ఫన్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో ఉంది.
అయితే ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ మూవీ కాకుండా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం రూపొందించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... అంటూ ఇప్పటి వరకు వెరైటీ టైటిల్స్ పెట్టిన వివేక్ ఆత్రేయ... ఈ చిత్రానికి కూడా డిఫరెంట్ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సరిపోదా శనివారం అనే టైటిల్ వినిపిస్తోంది.