నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన సమయంలో తనను ఎంతోమంది భయపెట్టారని అన్నారు నేచురల్ స్టార్ నాని. 'హిట్-2'తో నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన తాజాగా తాజాగా ఆ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
''నటుడిగా నేను వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వాల్ పోస్టర్ సినిమా టీమ్ కష్టపడి పనిచేయడం వల్లే ఈ సినిమా సాఫీగా పూర్తైంది. 'హిట్-2' కోసం పనిచేసిన నటీనటులు, ఇతర టెక్నికల్ బృందానికి ధన్యవాదాలు. శేష్.. కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ హిట్ కావడానికి కారణమదే. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలి, విభిన్న చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మొదలు పెట్టినప్పుడు.. ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు?, ఇలాంటివి చేస్తే వర్కౌట్ అవుతుందా? అని ఎంతోమంది నన్ను భయపెట్టారు. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయట్లేదు.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకంతోనే చేస్తున్నా. అది మరోసారి నిరూపితమైంది'' అని నాని అన్నారు.