తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నా దృష్టిలో పాన్​ ఇండియా అంటే అదే: నాని - నాని అంటే సుందరానికీ రిలీజ్ డేట్​

Nani Antey sundaraniki movie: నేచురల్​ స్టార్​ నాని నటించిన 'అంటే సుందరానికీ' ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగతులను తెలిపారు నాని. ఇంతకుముందు తాను చేసిన హాస్య ప్రధానమైన చిత్రాలకీ, దీనికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. తన ఉద్దేశంలో పాన్​ ఇండియా అంటే ఏంటో వివరించారు.

nani antey sundaraniki
నాని అంటే సుందరానికీ

By

Published : Jun 7, 2022, 6:39 AM IST

Nani Antey sundaraniki movie: హాస్యం పండించడంలో నాని టైమింగే వేరు. చిన్నపాటి హావభావాలతోనే ఆయన నవ్వులు పండిస్తుంటారు. సుందర్‌ పాత్రతో మరోసారి కడుపుబ్బా నవ్విస్తానని చెబుతున్నారు. ఆయన కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాని.. చిత్ర సంగతులను తెలిపారు.

సుందర్‌ పాత్రలో అమాయకంగా కనిపించారు. 'అంటే...' ఓ అమాయకుడి కథ అనుకోవచ్చా?
అమాయకంగా కనిపించే ఓ టక్కరోడు సుందర్‌. ఎంత టక్కరోడనేది సినిమా ఆరంభంలోనే చెప్పాం. చట్టబద్ధమైన హెచ్చరిక అంటూ ధూమపానం, మద్యపానం హానికరం అని చెబుతాం కదా.. అక్కడ 'సుందర్‌ బీడీ, సిగరెట్‌ తాగడు, ఈ ఒక్క విషయంలో మాత్రం వాణ్ని అనుసరించండి, ఇంకే విషయంలోనూ వద్దు' అని చెబుతాం. దర్శకుడు ఈ కథ చెప్పేటప్పుడే 'సుందర్‌ ఓ వరస్ట్‌ఫెలో సర్‌, కానీ వీణ్ని ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకులు ప్రేమించాలి' అన్నాడు. టీజర్‌, ట్రైలర్‌ చూస్తే 'పాపం తండ్రి చేతిలో నలిగిపోతున్నాడు' అనుకుంటారంతా. కానీ తనలో ఉన్న టక్కరితనం కూడా అలా అమాయకంగా బయటికొస్తూ ఉంటుందన్నమాట. అలా నటించడమే నాకో పెద్ద సవాల్‌గా మారింది.

ఇలాంటివి మీకు అలవాటైన పాత్రలే కదా...
ఇంతకుముందు నేను చేసిన హాస్య ప్రధానమైన చిత్రాలకీ, దీనికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో ఓ కొత్త టైమింగ్‌ కనిపిస్తుంది. ఎక్కడైనా నా పాత సినిమాల్ని గుర్తు చేస్తూ, పాత నానిలా చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. 'అష్టాచమ్మా', 'పిల్ల జమిందార్‌', 'భలే భలే మగాడివోయ్‌'... ఇలా ఏ సినిమా తీసుకున్నా, ఇందులోని పాత్రకీ, ఆ టైమింగ్‌కీ మ్యాచ్‌ అవ్వదు. వివేక్‌ ఆత్రేయ రచనలోని ప్రత్యేకత అది. కొత్త నాని, కొత్త టైమింగ్‌, కొత్త సెటప్‌ అన్నమాట.

యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో ప్రయాణం ఎలా సాగింది?
అగ్ర దర్శకులతో కాకుండా... రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతోనే చేస్తుంటావెందుకు? అని అడుగుతుంటారు చాలామంది. నేనేమో భవిష్యత్తు అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తున్నానని చెబుతుంటాను. గౌతమ్‌ తిన్ననూరి, రాహుల్‌ సంకృత్యాన్‌, వివేక్‌ ఆత్రేయ... వీళ్లంతా భవిష్యత్‌ స్టార్‌ దర్శకులు. వాళ్లు ఎదిగాక నేను వాళ్లతో కలవడం కంటే... ఇప్పుడే వాళ్ల ప్రయాణంలో భాగమైతే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. వివేక్‌ ఆత్రేయకి తనకంటూ ఓ ఒరిజినల్‌ స్టైల్‌ ఉంది. సినిమాల్లో ఇవి నడుస్తాయి, ఇవైతే ఆడతాయి కాబట్టి అన్నట్టు కాకుండా... తనదైన వాయిస్‌తో సినిమా చేస్తాడు. తన కథలు చాలా ఒరిజినల్‌గా ఉంటాయి. తన సినిమా కథని ఎవరి చేతికిచ్చినా తనలా మాత్రం తీయలేరు. అతని రచన, ఆలోచనలు అలా ఉంటాయి.

కథ చెప్పడం వేరు, తీయడం వేరు, చెప్పింది తీస్తారో లేదో అనే సందేహం ఎప్పుడైనా కలుగుతుందా?ఆ విషయంలో ధైర్యంతో ముందడుగు వేస్తాను. నా ప్రయాణం మొదలైనప్పుడు కూడా కొత్తవాణ్నే కదా. నన్ను నమ్మి చాలా మంది సినిమాలు తీశారు. నాలుగైదు సినిమాల తర్వాతే నేనూ నాకంటూ ఓ శైలి ఏర్పాటు చేసుకున్నా. అప్పుడు నేనూ ప్రతిభ ఉన్న దర్శకులకి అలాంటి ఓ వేదిక కావాలి కదా. ప్రతిభ ఉందనే నమ్మకం కుదిరితే ఇంకేమీ ఆలోచించకుండా, భయపడకుండా దూకేస్తా.

పాన్‌ ఇండియా మార్కెట్‌పై మీ ఆలోచనలేమిటి?
నా ఉద్దేశంలో మన సినిమాని మనం పాన్‌ ఇండియా సినిమా అనుకోవడం కాదు. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది పాన్‌ ఇండియా చిత్రం. కంటెంట్‌ బలంగా ఉండాలి, మంచి సినిమా తీయాలి. యూనివర్సల్‌ కథలతో తీస్తే పాన్‌ ఇండియా సినిమా అనే మాట కూడా అంటుంటారు. అది కూడా కరెక్ట్‌ కాదు. ‘పుష్ప’ సినిమానే తీసుకుందాం, మన అడవుల్లో జరిగే కథ అది. ఉత్తరాదికీ, ఆ సినిమా నేపథ్యానికీ ఏమైనా సంబంధం ఉందా? మంచి సినిమా కాబట్టే అది పాన్‌ ఇండియా స్థాయిలో ఆదరణ పొందింది. అయితే చిత్రసీమలో ఇప్పుడు బంగారంలాంటి దశ అని చెబుతాను. సినిమా బాగుంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ప్రత్యేకంగా మన తెలుగుకే మంచి రోజులని చెప్పను.. భారతీయ సినిమా పరిశ్రమకే మంచి రోజులొచ్చినట్టుగా భావిస్తా.

‘దసరా’ చిత్రం కోసం జుట్టు, గడ్డం పెంచారు. ఆ సినిమా ఎంతవరకు వచ్చింది?

ఇంత గడ్డం, జుట్టుతో ఉండడం కష్టమైన విషయమే. తెలుగులో వస్తున్న ఓ శక్తిమంతమైన నాటు సినిమా ఇది. 25 శాతం చిత్రీకరణ పూర్తయింది.

మీ నిర్మాణ సంస్థలో రాబోతున్న సినిమాలు?

‘మీట్‌ క్యూట్‌’ అనే సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. వచ్చే నెలలో ‘హిట్‌ 2’ని తీసుకొస్తాం. ఆ ఫ్రాంచైజీలో ఏడు సినిమాలు చేయబోతున్నాం. ఆ ఏడు చిత్రాల్ని కలిపి మరో సినిమా చేస్తాం. అందులో నేనొక సినిమా చేస్తానా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పను.

ప్రేమ వివాహం... అమెరికా కలలు.. ఇలా చాలా విషయాల్నే స్పృశించినట్టు తెలుస్తోంది. మీ నిజ జీవితంలో వాటి గురించి ఏం చెబుతారు?
ఇప్పుడెలా ఉందో తెలియదు కానీ... పది పదిహేనేళ్ల కిందట అమెరికా వెళ్లడమే లక్ష్యంగా చాలా మంది కనిపించేవాళ్లు. మా ఇంట్లో మేం 15 మంది కజిన్స్‌. నేను పదిహేనోవాణ్ని. మిగిలిన వాళ్లంతా అమెరికాలోనే ఉన్నారు. నాకు మాత్రం ఆ కోరిక ఎప్పుడూ లేదు. ఇక వివాహం అంటారా? నాది ప్రేమ వివాహమే కానీ, సినిమాలోలాగా కుల, మతాంతర వివాహం కాదు. మా రెండు కుటుంబాలు చక్కగా మాట్లాడుకుని పెళ్లి జరిపించారు. నా భార్య కుటుంబంలో శాస్త్రవేత్తలే ఎక్కువ. నేనేమో సినిమాల చుట్టూ తిరుగుతున్నా.

లీలా పాత్ర కోసం నజ్రియా ఎంపిక ఎవరి నిర్ణయం?

నేను, వివేక్‌ ఆత్రేయ ఇద్దరం అనుకుని తీసుకున్న నిర్ణయం అది. మేం ఎప్పుడు కలిసి హీరోయిన్‌ గురించి మాట్లాడుకున్నా నజ్రియాలాంటి హీరోయిన్‌ అయితే బాగుంటుందనే మాట వచ్చేది. అలాంటి హీరోయిన్‌ ఎందుకు, ఆమెనే అడుగుదాం అని సంప్రదించాం. ఈ కథ విన్న వెంటనే ‘నేను చేస్తా...’ అంటూ ఎగిరి గంతేసింది

ఈమధ్య ఏదైనా సినిమానో లేదంటే ప్రచార చిత్రాల్నో చూసినప్పుడు ఇలాంటి కథని నేను చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలిగిందా?
‘జై భీమ్‌’ చూసినప్పుడు అలా అనిపించింది. తెలుగులో ఇలాంటి కథలు చెప్పాలని, నేను చేయాలనే అభిప్రాయం కలిగింది. సినిమా చూసిన తర్వాత కూడా కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తూ, మనతోపాటే కొంతకాలం ప్రయాణం చేసే కథ అది.

ఇందులోని మీ గెటప్‌ బారిష్టర్‌ పార్వతీశంని గుర్తు చేసింది. ఆ రచనతో సినిమాకి సంబంధమేమైనా ఉందా?
పంచెకట్టు గెటప్‌కి ఆ పాత్రే స్ఫూర్తి. అది తప్ప ఇంకేం సంబంధం ఉండదు. కానీ ఆ బారిష్టర్‌ పార్వతీశంకి ఓ నివాళిలా ఉంటుందీ చిత్రం. అదెలా అనేది తెరపైనే చూడాలి. రెడీమేడ్‌ కట్టుతో కూడిన పంచె అది. కట్టుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదు. సినిమాలో ఓ సన్నివేశంలో మాత్రమే అలా కనిపిస్తా. కానీ ఆ సన్నివేశం బోలెడంత సందడిని పంచుతుంది. ఇలాంటి పాత్రలు, నేపథ్యాలు ఇచ్చినప్పుడు మామూలుగా కొంచెం నాటకీయతని జోడిస్తుంటారు. పాత్రలతో మాట్లాడించే విధానం కూడా వేరుగా ఉంటుంది. కేవలం కామెడీ కోసమే అనుకున్నప్పుడు అలా ఎక్కువ చేయించడంలో తప్పు లేదేమో. కానీ ఈ కథ అలా ఉండదు. ఇది సినిమా, ఇది వాస్తవం అన్నట్టు కాకుండా తన కుటుంబంలోని వాతావరణాన్ని కళ్లకు కట్టారు. సినిమా చూస్తున్నప్పుడు పాత్రల మధ్యే గడుపుతున్న అనుభవం కలుగుతుంది.

ఇదీ చూడండి:గ్లామర్​ డోస్​ పెంచేసిన సమంత.. సన్నీ లియోనీ ఏడుపు..

ABOUT THE AUTHOR

...view details