Nani Antey sundaraniki: "నేను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. వరుస సినిమాలు చేయాలి, స్టార్ అవ్వాలి అన్న లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. నాకు తెలిసింది ఒకటే.. మంచి సినిమాల్లో భాగమవ్వాలి, నా పాత్రలతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేయాలి" అంది నటి నజ్రియా. అనువాద చిత్రం 'రాజా రాణి'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 'అంటే.. సుందరం'తో అలరించేందుకు సిద్ధమైంది. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలు పంచుకుంది నజ్రియా.
తొలిసారి తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు? ఏమన్నా కష్టంగా అనిపించిందా?
"మరీ కష్టంగా ఏమీ అనిపించలేదు. నేను స్క్రిప్ట్ విన్న వెంటనే దివ్య అనే ఓ ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకున్నా. ఆమె సహాయంతో ఈ కథలోని ప్రతి పాత్ర సంభాషణల్ని అర్థం చేసుకొని, నేర్చుకున్నా. ప్రతి పదం అర్థం తెలుసుకోవడమే కాక దాన్ని ఎలా పలకాలో నేర్చుకున్నా. ఇలా సెట్‌లోకి అడుగు పెట్టే సమయానికే ఈ పాత్ర కోసం పక్కాగా సిద్ధమైపోయా. అందుకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం అంత కష్టమనిపించలేదు".
బాలనటిగా తెరపైకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో సినిమాల్ని మిస్ అవుతున్నా అనిపించేదా?
"అలా ఎప్పుడూ అనిపించలేదు. వైవాహిక జీవితాన్ని చాలా ఆస్వాదించా. కాకపోతే ఫహద్ అడుగుతుండేవాడు.. 'ఏంటి స్క్రిప్ట్స్ వినట్లేద'ని. నాకేమో ఏదైనా ఆసక్తికరమైన కథ, నేను మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్ర దొరికితే చేయాలనుకునేదాన్ని. అలాంటి కథలు చాలా అరుదుగా దొరుకుతుండేవి".
‘రాజా రాణి’తో టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. నేరుగా తెలుగులో చేయడానికి ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నారెందుకు?
"ఇదేం ప్లాన్ ప్రకారం చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగి పోయింది. నేను కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంటా. తెలుగులో చేయాలని ఉంది. సరైన కథ దొరకలేదు. 'అంటే.. సుందరానికీ' వచ్చే సరికి.. ఇందులో చాలా ఫన్ ఉంది.. ఎమోషన్ ఉంది.. ప్రతి పాత్రకీ నటనకు ఆస్కారముంది. అలాగే చాలా కమర్షియల్‌గానూ ఉంటుంది. ఇలా అన్ని అంశాలు పక్కాగా కుదిరిన స్క్రిప్ట్ దొరకడం చాలా అరుదు. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే చేస్తానని చెప్పేశా".
ఈ చిత్రంలో కులాంతర, మతాంతర వివాహాలపై చర్చించినట్లు కనిపిస్తోంది. వాటిపై మీ ఉద్దేశం ఏంటి?
"వివాహ బంధం విషయంలో కులమతాల పట్టింపులు ఉండకూడదు. నేను నమ్మేది అదే. మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. మీ సొంత కులం లేదా మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఏ బంధమైనా ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. అన్నిటికంటే గొప్పది అదే. మన పిల్లల తరానికైనా ఈ కుల మతాల సమస్య ఉండదని కోరుకుంటున్నా. కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని చాలా మందికి అర్థమైంది. ఇలాంటి విషయాలపై మొండిగా ఉండటం అర్థం లేదని అర్థం చేసుకుంటున్నారు’’.