కొవిడ్ భయాలతో థియేటర్లు కళ తప్పిన వేళ 'అఖండ'తో బాలకృష్ణ, 'క్రాక్'తో గోపీచంద్ మలినేని నూతనోత్తేజాన్ని అందించారు. సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. చిత్రసీమకు కొత్త కళ తీసుకొచ్చారు. అందుకే ఇలాంటి అపురూప కలయికలో ఓ సినిమా పట్టాలెక్కిందనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ బాలకృష్ణకు గోపీచంద్ వీరాభిమాని. ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఏం కోరుకుంటారో.. వాళ్లకు ఆయన్ని ఎలా చూపించాలో బాగా తెలుసు.
ఈ లెక్కలకు తగ్గట్లుగానే ఆయన రెండు పాత్రలతో కూడిన ఓ మాస్ కమర్షియల్ కథతో బాలకృష్ణను 'వీరసింహారెడ్డి'గా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి పాటలు, ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఎలాంటి వినోదాలు పంచిచ్చింది? బాలయ్య యాక్షన్ హంగామా మరోసారి సినీప్రియుల్ని మెప్పించిందా? గోపీచంద్ మలినేని ప్రయత్నం ఫలించిందా?
చిత్రం: వీరసింహారెడ్డి; నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, సప్తగిరి, తదితరులు; సినిమాటోగ్రఫీ:రిషి పంజాబీ; ఎడిటింగ్: నవీన్ నూలి;సంగీతం: తమన్; మాటలు: సాయి మాధవ్ బుర్రా; నిర్మాణ సంస్థ: మైత్రిమూవీ మేకర్స్; నిర్మాతలు:నవీన్ ఏర్నేని, రవి శంకర్; కథ, కథనం, దర్శకత్వం: గోపీచంద్ మలినేని; విడుదల తేదీ: 12-01-2023
కథేంటంటే: జై అలియాస్ జై సింహా రెడ్డి ఆయన తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటారు. ఓ అనుకోని సంఘటన వల్ల జైకు ఈషా (శ్రుతి హాసన్) దగ్గరవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లికి సిద్ధమవుతారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి (మురళీ శర్మ)తో చెప్పగా.. దానికి అతను కూడా ఒప్పుకొంటాడు. సంబంధం గురించి మాట్లాడటానికి జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని చెబుతాడు.
అప్పటి వరకు తండ్రి లేడని అనుకుంటున్న జైకు తన తల్లి ఓ నిజం చెబుతుంది. జనం మీద ప్రేమతో.. సీమపైన అభిమానంతో ఊరి బాగు కోసం కత్తి పట్టిన గొప్ప నాయకుడు, తన బావ వీరసింహారెడ్డి (బాలకృష్ణ)కి పుట్టిన బిడ్డవని చెబుతుంది. తమ కొడుకు పెళ్లి విషయమై మాట్లాడటానికి ఇస్తాంబుల్ రమ్మని వీరసింహకు మీనాక్షి కబురు పంపుతుంది. అయితే వీరా సీమ వదిలి ఇస్తాంబుల్ వెళ్లాడని తెలుసుకున్న ప్రత్యర్థి ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) అతన్ని చంపేందుకు తన భార్య భాను (వరలక్ష్మీ శరత్ కుమార్)తో కలిసి అక్కడికి వెళ్తాడు.
ఇంతకీ ఆ భాను మరెవరో కాదు.. వీరసింహారెడ్డికి స్వయానా చెల్లెలు. ఎన్నో ఏళ్లుగా తన అన్న చావు చూడాలని పగతో రగిలిపోతుంటుంది. అందుకే ఏరికోరి అతని శత్రువు ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. మరి వీరసింహారెడ్డిని చంపేందుకు ఇస్తాంబుల్ వెళ్లిన ప్రతాప్ రెడ్డి, భాను తాము అనుకున్నది సాధించారా? అసలు తన అన్నను చంపాలని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి అతనికి ఉన్న విరోధం ఏంటి? వీర సింహా రెడ్డి, మీనాక్షి విడిపోవడాని కారణమేంటి? తన తండ్రి గతం తెలుసుకున్న జై శత్రువులకు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే: ఫ్యాక్షన్ కథలకు చిరునామా బాలకృష్ణ. సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి, నరసింహానాయుడు వంటి ఎన్నో విజయవంతమైన సీమ కథలతో సినీప్రియుల్ని ఉర్రూతలూగించారు. ఇప్పుడొచ్చిన ఈ వీరసింహారెడ్డి కూడా ఈ తరహా కథాంశంతో రూపొందిన చిత్రమే. కాకపోతే ఈసారి ఈ ఫ్యాక్షన్ యాక్షన్ కథకు చెల్లి సెంటిమెంట్‌ను జోడించి కొత్తదనం అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఊరు బాగు కోసం కత్తి పట్టిన అన్న.. అతన్ని చంపి పగ తీర్చుకోవాలని 30ఏళ్లుగా ఎదురు చూసే చెల్లి.. ఈ పాయింటే చాలా ఆసక్తికరం. అయితే దీని వెనకున్న ఆసక్తికర కథేంటో తెలియాలంటే.. ప్రధమార్ధంలోని ఫ్యాక్షన్ యాక్షన్ హంగామాను రుచి చూడాలి.
వీరసింహారెడ్డిలో ప్రధమార్ధంలో కథ పెద్దగా కనిపించదు. ఓ శక్తిమంతమైన ఎలివేషన్‌తో ప్రతినాయకుడ్ని పరిచయం చేయడం.. ఆ వెంటనే అంతకంటే శక్తిమంతమైన యాక్షన్ ఎపిసోడ్‌తో ఇస్తాంబుల్‌లో జై పాత్ర పరిచయమవడం చకచకా జరిగిపోతాయి. ఈషా పాత్ర పరిచయ సన్నివేశాలు కాస్త విసిగిస్తాయి. ఆమె జైతో ప్రేమలో పడటం.. వారిద్దరి పెళ్లికి ఈషా తండ్రి పచ్చజెండా ఊపడం.. ఆ తర్వాత జైకు అతని తల్లి గతం చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక వీరసింహారెడ్డి పాత్ర పరిచయమైనప్పటి నుంచి ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లతో థియేటర్ మోత మోగిపోతుంది.
ప్రతాప్ రెడ్డి గజనీ మహమ్మద్‌లా పదే పదే వీరసింహారెడ్డిపైకి తన బలగంతో విరుచుకుపడటం.. అతని చేతిలో తుక్కు తుక్కుగా కొట్టించుకొని ఇంటికెళ్లి పెళ్లాంతో చివాట్లు తినడం ఇదే తంతు. అయితే వీళ్ల మధ్యలో వచ్చే ప్రతి పోరాటఘట్టాన్నీ వావ్ అనేలా తీర్చిదిద్దారు రామ్-లక్ష్మణ్. ముఖ్యంగా పెళ్లి వేడుకలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, కుర్చీలో కూర్చొనే ప్రతాప్ రెడ్డి గ్యాంగ్‌ని వీరసింహారెడ్డి చీల్చి చెండాడే ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చక్కటి ట్విస్ట్‌తో ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా తీర్చిదిద్దారు.