"స్టైలిష్‌గా సాగే ఓ యాక్షన్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ఆ కోరిక 'ది ఘోస్ట్'తో నెరవేరింది" అన్నారు నాగార్జున అక్కినేని. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన చిత్రమే 'ది ఘోస్ట్'. దసరా సందర్భంగా తెలుగుతోపాటు, తమిళంలోనూ బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"యాక్షన్ సినిమాలు నాకు కొత్త కాదు. 'గరుడవేగ'లో ప్రవీణ్ సత్తారు చూపించిన యాక్షన్ నచ్చడంతో తనని పిలిచి భావోద్వేగాలతో కూడిన స్టైలిష్ యాక్షన్ సినిమా చేయాలని ఉందని చెప్పా. అప్పుడు నన్ను దృష్టిలో ఉంచుకునే ఈ కథ తయారు చేశాడు. దీనికోసం మూడు వారాలు శిక్షణ తీసుకున్నా. ఈ కథలో మంచి కుటుంబ నేపథ్యం ఉంది సోదరి కుటుంబాన్ని కాపాడటం కోసం కథానాయకుడు చేసే పోరాటం బాగుంటుంది. ఒక యాక్షన్ కథలో భావోద్వేగాలు ఈ స్థాయిలో పండటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ప్రేక్షకులూ థియేటర్‌లో అదే అనుభూతికి గురవుతారు. పతాక సన్నివేశాలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి".
- "ఈ సినిమా ప్రచారంలో 'తమహగనే' అనే ఆయుధం కీలక పాత్ర పోషించింది. ఆయుధాన్ని తయారు చేసేందుకు వాడే లోహం పేరు అది. దీని వెనక ఓ కథ ఉంది. ఈ సినిమాలో దాన్ని చెప్పలేదు కానీ, విజయం సాధించాక ప్రీక్వెల్‌గా మరో సినిమా తీస్తామేమో చెప్పలేం (నవ్వుతూ). అంత ఆసక్తిగా ఉంటుంది ఆ కథ. 'శివ'ని కూడా మొదట నేనొక యాక్షన్ కథలాగే భావించి సెట్స్‌పైకి వెళ్లా. తీరా ఆ సినిమా పూర్తయ్యాక చూసుకుంటే కుటుంబ నేపథ్యం చాలా బాగా కుదిరింది. 'ది ఘోస్ట్' విషయంలోనూ అదే జరిగింది. అందుకే కర్నూలు వేడుకలో 'శివ'తో 'ది ఘోస్ట్'కి పోలిక పెట్టి మాట్లాడా. ప్రవీణ్ సత్తారు విజన్ ఉన్న దర్శకుడు. 66 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. కె.రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, కోదండరామిరెడ్డి... తదితర సీనియర్ దర్శకులతోనూ అలాగే పనిచేశా"
- "సినిమాలకి ఇప్పుడు హద్దులు లేవు. అమెరికాలో 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రదర్శన, ఆ స్పందన సామాజిక మాధ్యమాల్లో చూశాక ప్రపంచ సరిహద్దులూ చెరిగిపోయాయనే అభిప్రాయం కలిగింది. ఈ ఏడాదిలోనే కొత్త సినిమాని ప్రారంభిస్తా. అఖిల్, నేను కలిసి నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి".
- "నేనూ, చిరంజీవి మంచి స్నేహితులం. మా సినిమాలు ఒకే రోజు విడుదల కాలేదేమో కానీ, ఒకట్రెండు రోజులు అటూ ఇటూగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అవి విడుదలై విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. నా చిత్రాలన్నీ డిజిటల్ చేయించే ప్రయత్నం జరుగుతోంది. కొన్నింటి నెగిటివ్‌లు పాడయ్యాయి. 'శివ'కి సంబంధించి 4కే పనులూ చేస్తున్నాం".