Nagarjuna The Ghost Movie: ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా తన యాక్షన్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు హీరో నాగార్జున సిద్ధమవుతున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని వెల్లడించింది. త్వరలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తామని ప్రకటించింది.
అంతేకాకుండా జులై 9న ఫస్ట్ విజువల్ పేరుతో 'ది ఘోస్ట్' టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నాగార్జున కొత్త పోస్టర్‌ను గురువారం మేకర్స్ విడుదలచేశారు. ఇందులో చేతిలో కత్తి పట్టుకొని శత్రువులపై పోరాటానికి సిద్ధమైనట్లుగా నాగార్జున కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది.
Ponniyin Selvan Trisha First Look: రోజుకొక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ 'పొన్నియన్ సెల్వన్' సినిమా పట్ల అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు విలక్షణ దర్శకుడు మణిరత్నం. ఇప్పటికే రిలీజ్ చేసిన విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. తాజాగా హీరోయిన్ త్రిష ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె యువరాణి కుందవాయి పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.