మనిషికి పేరు ఎంత ముఖ్యమో ఓ చిత్రానికి కథతో పాటు టైటిల్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఓ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. అందుకే ఓ చిత్రానికి పేరు పెట్టడంలో దర్శకనిర్మాతలు తలబద్దలుకొట్టుకుంటారు. కానీ ఎట్టిపరిస్థితిలోనూ రాజీపడరు. హీరో పాత్ర, సినిమా కథకు తగ్గట్టు సరిపోయేలా పెడతారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు.. ఒక పేరే చాలామంది వ్యక్తులకు ఉన్నట్టు కొన్ని చిత్రాలకూ ఒకే పేరు ఉంటుంది. కథకు సరిగ్గా సరిపోయే పేరు పెట్టాలంటే ఇలా చేయక తప్పదు మరి! కథ డిమాండ్‌ను బట్టి దర్శక నిర్మాతలు ఇలా చేస్తుంటారు.
అయితే ఇలా కథ వేరైనా ఒకే పేరుతో చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో తెలుగు తెరకు ఆరాధ్య దైవం అయిన నందమూరి ఎన్టీ రామారావు, అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగార్జున చిత్రాలు ఒకటి. వీరిద్దరు వేర్వేరుగా ఎదురులేని మనిషి అనే ఒకే టైటిల్‌తో సినిమాలు చేశారు.
కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'ఎదురులేని మనిషి' 1975 డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. అశ్వనీదత్ నిర్మాత. శేఖర్(ఎన్టీఆర్) తండ్రిని తన బాల్యంలో ఇద్దరు దుండగులు హత్య చేస్తారు. ఆ హత్య చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని శేఖర్ తన తమ్ముడు గోపితో కలిసి పారిపోతాడు. ఆ తర్వాత శేఖర్, గోపీలు విడిపోవడం జరుగుతుంది.ఒకవైపు తండ్రిని చంపిన హంతకుల మీద పగ సాధించాలన్న పట్టుదల, మరో పక్క దూరమైన తమ్ముడిని ఎలాగైనా కలుసుకోవాలి అని శేఖర్ ప్రయత్నిస్తుంటాడు. అలా స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకుంటూ తన తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేది ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్ర కథాంశం.