Nagachitnya On Rashmika Deep Fake Video :సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టించిన హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే చాలా నిరుత్సాహం కలుగుతోంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను తలచుకుంటే మరింత భయంగా ఉంది. బాధితులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టాన్ని తీసుకురావాలి' అని అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు రష్మిక.. థ్యాంక్యూ అని రిప్లై పెట్టారు. నాగచైతన్యతో పాటు ప్రముఖ గాయని చిన్మయి కూడా ఈ వీడియోపై పోస్ట్ పెట్టారు. ఇలాంటి ఘటనలు చాలా ప్రమాదకరమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్ వీడియోలను అరికట్టాలని కోరారు.
చాలా బాధగా ఉంది : రష్మిక
అంతకుముందు.. రష్మక ఈ డీప్ ఫేక్ వీడియోపై ట్విట్టర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఆన్లైన్లో వైరల్ అయిన నా డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉంది. టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఇలాంటివి చేస్తే.. నాకే కాదు మనలో ప్రతి ఒక్కరికి భయంగానే ఉంటుంది. నాకు రక్షణగా, మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఈరోజు ఒక మహిళగా, నటిగా నా కృతజ్ఞతలు. ఇలాంటి ఘటన నా కాలేజీ లేదా స్కూల్ రోజుల్లోనో జరిగితే.. నేను ఎలా ఎదుర్కొనేదాన్నో ఊహించలేను. ఇలాంటి ఐడెంటిటీ థెఫ్ట్ వల్ల మనలో ఎక్కువ మంది ప్రభావితం అవుతాం. అందుకే మనందరం సంఘంగా కలిసి దీన్ని అత్యవసరంగా పరిష్కరించాలి.' అని రాసుకొచ్చారు.
స్పందించిన ప్రముఖులు.. ఎవరేమన్నారంటే...
ఈ ఫేక్ వీడియోపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదటగా స్పందించారు. ఆ తర్వాత ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టికి ఆకర్షించింది. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు.
"ఇలాంటి ప్రమాదకరమైన మిస్ ఇన్ఫర్మేషన్ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న అందరు డిజిటల్ నాగరికుల సేఫ్టీ, ట్రస్ట్ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది"
--రాజీవ్ చంద్ర శేఖర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి