Nagababu Chiranjeevi wishes : తన సోదరులు, నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోనని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘మెగా కార్నివాల్’ కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత సాధించినా చిరంజీవిని కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థంకావట్లేదన్నారు.
నాకంటే ఎక్కువగా ఎవరూ చెప్పలేరు..
"ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా అన్నయ్య తన 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే అది మామూలు విజయం కాదు. చిరంజీవిగారి గురించి ఇక్కడ నాకంటే ఎక్కువగా చెప్పేవారు ఎవరూ లేరు. ఇప్పుడే కాదు.. ఆయన్ను నేను నా చిన్నప్పటి నుంచీ హీరోగానే చూశా. పాఠశాల, కళాశాల విద్యనభ్యసించే రోజుల్లో అన్నయ్యకి మంచి క్రేజ్ ఉండేది. తన తమ్ముణ్ణి అయిన నన్ను నిర్మాతగా నిలబెట్టి జీవితాన్ని ఇచ్చాడు. తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఏదో చేయాలనే తపన ఉన్నవాడు. తన భావాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకుని, దర్శకుడిగా మారాలనుకున్నప్పుడు ‘‘నువ్వు డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు కల్యాణ్. నీలో ఓ స్పార్క్ ఉంది. హీరో ఇమేజ్ ఉంది. నువ్వు హీరోగానే కరెక్ట్’’ అని అన్నయ్య చెప్పాడు. అలా అన్నయ్య మాటని కాదనకుండా పవర్ స్టార్‌గా మీ ముందుకు వచ్చాడు పవన్. జనసేనానిగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే గొప్ప నాయకుడాయన. అలాంటి నాయకుణ్ణి కానుకగా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కుళ్లిపోయిన రాజకీయాలపై అస్త్రాన్ని జనసేనాని ఎక్కుపెట్టాడు. నేనూ ఆయన పార్టీలో ఉంటూ భుజం కాస్తున్నా. అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్,శిరీష్, నిహారిక.. వీరందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చిన మహానుభావుడు చిరంజీవి. ఆయన రుణాన్ని మేం ఎప్పటికీ తీర్చుకోలేం’’
నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ "ఇంత సాధించినా చిరంజీవిగారిని ఎందుకు విమర్శిస్తారో, ఆయన గురించి ఎందుకు అన్యాయంగా మాట్లాడతారో ఇప్పటికీ నాకు అర్థంకాదు. ఒకవేళ వారు అనుకుంటున్నట్టు చిరంజీవి సరైన వ్యక్తి కాకపోతే నేనూ పట్టించుకోను. కానీ, ఆయన ఎంత మంచి వాడో నాకు తెలుసు. చిరంజీవినేకాదు పవన్ కల్యాణ్‌నీ ఎవరైనా విమర్శించినా నేను ఊరుకోలేను. చాలా గట్టిగా కౌంటర్ ఇస్తా. దాంతో నన్ను ‘కాంట్రవర్సియల్ పర్సన్’ అని అంటుంటారు. నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు. నా అన్న, తమ్ముణ్ణి ఏమైనా అంటే తాటతీస్తా. ‘సైరా’ సినిమా చిత్రీకరణ సమయంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ కరెక్ట్ కాదు’ అని ఓ మీడియా సంస్థలో డిబేట్ నిర్వహించారు. ఓ గవర్నమెంట్ స్పాన్సర్డ్ మ్యాగజైన్ నిర్వహకులు చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతుంటారు. ఆ సంస్థకు నేను గౌరవం కూడా ఇవ్వను. కొన్ని పార్టీలకు కొమ్ముకాసే కొన్ని మీడియా సంస్థలకు చిరంజీవి గురించి ఏదో ఒకటి చెప్పకపోతే ఏం తోచదు. అన్నయ్య ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ స్థాపించాడు. సామాన్యుడికీ అందుబాటులో ఉండేలా మంచి ఆస్పత్రిని నిర్మించబోతున్నారు. ఇంతకు మించి ఆయన నుంచి ఏం ఆశిస్తారో నాకు అర్థంకాదు"
అప్పుడే నంబర్ 1 హీరో అవుతానని ఫిక్స్ అయ్యాడు..
‘‘తమ కెరీర్ ప్రారంభంలో అన్నయ్యతోపాటు హరిప్రసాద్, సుధాకర్ అనే వారు చెన్నైలో ఉండేవారు. సినిమాల ప్రివ్యూలకు వెళ్లి, అవి ఎలా ఉన్నాయో చెప్తుండేవారు. ఆ క్రమంలో ఓ సినిమా ప్రివ్యూకి వెళ్లగా సీట్లు ఖాళీగా లేవని ముగ్గురినీ నిల్చొబెట్టారు. ఆ అవమానంతో ‘ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని అవుతా’ అని అన్నయ్య అన్నాడు. ఈ మాట అన్నయ్యకు కూడా గుర్తుండకపోవచ్చు. కానీ, నేను మర్చిపోలేను. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా అంతటి ఆత్మవిశ్వాసం ఎక్కడ నుంచి వచ్చింది? యువతకు నేను చెప్పేది ఒక్కటే. కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించండి’’ అని నాగబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్, శ్రీకాంత్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మెగాస్టార్ రాజసం రూ.150కోట్ల బంగ్లా, ప్రైవేట్ జెట్, మొత్తం ఆస్తి విలువ ఎంతంటే