Godfather Taman: ''నేను తొలిసారి కలిసి పనిచేసిన హీరోలందరి సినిమాలు ఘన విజయం అందుకున్నాయి. ఆ ఆనవాయితీని 'గాడ్‌ఫాదర్' కొనసాగించింద''న్నారు సంగీత దర్శకుడు తమన్. ఇటీవలే జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆయన, వరుసగా అగ్ర తారల సినిమాలకి స్వరాలు సమకూరుస్తూ విజయ పరంపరని కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'గాడ్‌ఫాదర్'కి ఆయనే సంగీతం అందించారు. ఈ సందర్భంగా తమన్ గురువారం ముచ్చటించారు. ఆ విషయాలివీ.
''చిరంజీవితో నేను చేసిన తొలి సినిమా ఇదే. ఆయన సినిమాలకి సంగీతం ఇవ్వడం అంత సులభం కాదు. పైగా 'గాడ్‌ఫాదర్'లో పాటలకి, సంగీతానికి పెద్దగా అవకాశం లేదు. కథని నడిపే పాటలే ఉంటాయి. ఇలాంటి కథకి సంగీతం పరంగా ప్రభావం చూపించేలా పనిచేయడం ఎలా అని చాలా ఆలోచించి ఏడాదిపాటు నేనూ, మోహన్‌రాజా కష్టపడి పనిచేశాం. లండన్‌లో ప్రతిష్టాత్మక అబేయ్ రోడ్ స్టూడియోస్‌లో ఈ సినిమాకి నేపథ్య సంగీతం చేశాం. అక్కడ రికార్డ్ చేసిన తొలి భారతీయ సినిమా ఇదే. ఆ స్టూడియోని అందరికీ ఇవ్వరు''.