'3' సినిమాలోని 'వై దిస్ కొలవెరీ డీ' అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఈ పాటకు శ్రోతలకు ఊర్రూతలూగిపోయారు. ఇక యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి నోట ఇదే పాట. ఆ ఒక్క పాట ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఆ సాంగ్ సక్సెస్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచి సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఆయనే కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఆయన మంచి కంపోజర్‌తో పాటు సూపర్ సింగర్ కూడా. పలు సినిమాలకు హిట్ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను అలరించారు.
అనిరుధ్ తండ్రి రవిచంద్ర రాఘవేంద్ర తమిళ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్, మేనత్త సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత. ఇంకా చెప్పాలంటే ఆయన కుటుంబంలో సగం మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. అయినప్పటికీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు వినియోగించకుండా సొంత కాళ్లపై ఎదగాలనుకున్నారు రవిచందర్. అలా తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన '3' సినిమాతో తన సంగీత ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ తన ట్యాలెంట్‌ను చూపి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. తమిళంలో 'వనక్కం చెన్నై', 'వీఐపీ', 'మారి', 'పేటా', 'కత్తి' వంటి సూపర్ హిట్ సినిమాలకు స్వరాలను సమకూర్చారు. దీంతో రవిచందర్.. తమ సినిమాకు బాణీలు కట్టాలంటూ దర్శక నిర్మాతలు అనిరుధ్ కాల్షీట్ల కోసం క్యూ కట్టడం ప్రారంభించారు. ఎందుకంటే లిరిక్స్‌కు ఆయనిచ్చే ట్యూన్ ఒక ఎత్తైతే.. సినిమాకు ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. సీన్ ఎలాంటిదైనా సరే.. తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఇట్టే అట్రాక్ట్ చేస్తారు. హీరోలకు, విలన్స్‌కు ఈయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి.