తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'చిరంజీవి వల్లే 'గాడ్​ ఫాదర్'​లో ఆ లుక్​లో నటించా' - చిరంజీవి గురించి మురళీమోహన్

మెగాస్టార్​ చిరంజీవి, నటుడు మురళీ మోహన్‌ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా.. తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురళీ మోహన్‌. చిరంజీవి వల్లే తాను ఆ లుక్​లో కనిపించినట్లు వెల్లడించారు.

murali mohan
'చిరంజీవి వల్లే 'గాడ్​ ఫాదర్'​లో ఆ లుక్​లో నటించా'

By

Published : Jul 7, 2022, 11:14 PM IST

ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి, మురళీ మోహన్‌ కలిసి నటించిన చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. ఈ సినిమాని దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాను పోషించిన పాత్ర వివరాలను మురళీ మోహన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్‌ చేసి ఫలానా లుక్‌ కావాలన్నారని తెలిపారు. కెరీర్‌ ప్రారంభంలో తాను ప్రదర్శించిన నాటకాన్ని గుర్తుచేసుకున్నారు. ''మేం 'గాడ్‌ ఫాదర్‌' అనే సినిమా తీస్తున్నాం. దర్శకుడు మోహన్‌ రాజా మిమ్మల్ని చూడలేదు. మీ ఫొటోలు పంపిస్తారా?' అని చిరంజీవి అడిగారు. 'మీ నాన్నగారు చనిపోయినపుడు కొన్నాళ్లు మీరు వైట్‌ హెయిర్‌తో ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలుంటే పంపించండి' అని కోరారు. ఆయన అడిగినట్టే వాటిని పంపించా. దర్శకుడు చూడగానే ఈ గెటప్పే కావాలన్నాడట. అలా చిరంజీవి సూచన మేరకు తెల్ల జుట్టుతోపాటు గెడ్డాన్ని పెంచా. నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది'' అని మురళీ మోహన్‌ తెలిపారు.

''మా నాన్న, ఆయన సోదరులు, పలువురు బంధువులు బిజినెస్‌ చేసేవారు. వాళ్లని చూస్తూ పెరగడంతో నేనూ వ్యాపార్త వేత్తను కావాలనుకునేవాడ్ని. ఈ ఆసక్తితో చదువుపై శ్రద్ధ చూపించలేకపోయా. దాంతో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, రెండుసార్లు.. ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయ్యా. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. వ్యాపారం చేద్దామంటే ఆర్థిక భరోసా లేదు. అదే సయమంలో చెన్నైలోని 'ఆంధ్రా క్లబ్‌'లో నాటకాల పోటీ నిర్వహిస్తున్నారని తెలిసింది. నాతోపాటు ఉద్యోగంలేని కొందరం కలిసి సరదాగా ఓ నాటకం వేయాలని అనుకున్నాం. అంతకు ముందెన్నడూ మేం నాటకాలు ప్రదర్శించలేదు. అయినా ఏదో చేయాలనే తపన. చివరకు 'పోలీసు' అనే నాటిక రూపొందించాం. ఆ పోటీలకు సీనియర్‌ నటుడు కేవీఎస్‌ శర్మగారితోపాటు మరొకరు న్యాయనిర్ణీతలుగా వ్యవహరించారు. మా ప్రదర్శన పూర్తవగానే వారి దగ్గరకు వెళ్లి 'సర్‌ ఎలా ఉంది మా ప్రతిభ.. మమ్మల్ని ఎంపిక చేస్తారా' అని అడిగాం. 'చేయట్లేద'ని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. 'మీ సబ్జెక్ట్‌ బాగుంది కానీ నటన బాలేద'న్నారు. ఆ నిరాశలో ఉండగా దర్శకుడు రామినీడు, ఛటర్జీ మాకు లేఖ రాశారు. వారిద్దరూ నాటకాల్ని కండక్ట్‌ చేసేవారు. మీరు ఎంపికకాలేదని నిరుత్సాహపడొద్దు. మీకు వీలుంటే ఇక్కడికి వచ్చి మేం ఎలాంటి నాటకాలు ఎంపిక చేశామో చూడండి అన్నారు. అంతా చూద్దామని అక్కడకు వెళ్లాం. ఇతరులు వేసిన నాటకాల పెర్ఫామెన్స్‌ చూస్తే అదరహో అనిపించింది. వారితో పోల్చుకుంటే మేం నథింగ్‌. అంత బాగా చేశారు. ఆ కసితోనే నాటకాలపై మరింత ఆసక్తి పెరిగింది'' అని మురళీ మోహన్‌ వివరించారు.

'మనవూరి పాండవులు', 'త్రినేత్రుడు', 'యుద్ధభూమి', 'గ్యాంగ్‌ లీడర్‌' తదితర సినిమాల్లో కలిసి నటించి హిట్‌ కాంబోగా నిలిచారు చిరంజీవి, మురళీ మోహన్‌. సుమారు 30 ఏళ్ల తర్వాత 'గాడ్‌ ఫాదర్‌'కోసం కలిసి పనిచేశారు. మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం 'లూసీఫర్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2022 విజయదశమి కానుకగా విడుదలకానుంది.

ఇదీ చూడండి :'సాలరీ తక్కువని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది'.. సంపాదనలో పోలికపై కిరణ్​ సూపర్​ లాజిక్​..

ABOUT THE AUTHOR

...view details