Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు. సల్మాన్ సహా అతడి తండ్రి సలీమ్ ఖాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం సల్మాన్ ఇంటి వద్దకు చేరుకున్న సీనియర్ అధికారులు.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
ఇదీ జరిగింది:ఆదివారం ఉదయం సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.