movie sequels trend in tollywood : 'బాహుబలి' చిత్రాలకు దక్కిన ఆదరణ.. కథలు చెప్పడంలో కొత్త మార్పులకు నాంది పలికింది. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న విస్తారమైన కథల్ని.. భాగాలుగా విడగొట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్మాతలకూ లాభదాయకంగా ఉండటంతో.. చిత్రసీమలో ఈ ఫార్ములాకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సందడి చేస్తున్న 'బ్రహ్మాస్త్ర', త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప2' వంటి చిత్రాలు ఇలా భాగాలుగా రూపొందుతోన్నవే. అయితే ఇలా కొనసాగింపు కథలతో మ్యాజిక్ చేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఈ తరహా సినిమాల విషయంలో తొలి భాగం విజయం సాధించడం ఎంతో కీలకం. అది ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంటుంది.. ఆ చిత్ర ముగింపు కొనసాగింపు కథపై ఏస్థాయిలో అంచనాల్ని పెంచుతుంది అనే దానిపైనే మలి భాగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేదంటే ఈ తరహా కథలన్నీ కంచికి చేరని కథలుగానే మిగిలిపోతాయి.
ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ'తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రవితేజ. శరత్ మండవ తెరకెక్కించిన చిత్రమిది. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది ఈ సినిమా. ఈ చిత్ర ముగింపులో కొనసాగింపు కథపైనా స్పష్టత ఇచ్చారు చిత్ర దర్శకుడు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకోవడంతో.. మలి భాగం ఉంటుందా? అన్నది సందేహంగానే మారింది. ‘ది వారియర్’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేశారు కథానాయకుడు రామ్. లింగుస్వామి తెరకెక్కించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్ర విడుదలకు ముందే ‘ఈ సినిమాని ఓ సిరీస్‌లా కొనసాగించాలన్న ఆలోచన ఉంద'ని వెల్లడించారు దర్శకుడు లింగుస్వామి. ఇందుకు తగ్గట్లుగానే 'వారియర్' క్లైమాక్స్‌ను కొనసాగింపునకు వీలుగానే ముగించారాయన. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్ర కొనసాగింపుపైనా పూర్తిగా నీలినీడలు కమ్ముకున్నాయి.
వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. ఇటు యువతరంలోనూ అటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కథానాయకుడు నితిన్. ఆయన గతేడాది 'చెక్' రూపంలో ఓ ప్రయోగం చేశారు. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రమిది. వినూత్నమైన థ్రిల్లర్ కథతో రూపొందింది. ఓ తెలివైన కుర్రాడు చేయని నేరానికి జైలు పాలవ్వాల్సిరావడం.. తన తెలివితేటలతో చెస్‌లో ప్రతిభ చూపి అందరి మనసులు గెలుచుకొని.. కేసు నుంచి బయట పడే ప్రయత్నం చేయడం చిత్ర కథాంశం. ఈ కథని ముగించిన తీరులోనే.. కొనసాగింపు పైనా స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో ఆ సీక్వెల్ ఆలోచన అటకెక్కినట్లు తెలిసింది.