Movie Director With No Flops : సినీ ఇండస్ట్రీలో గెలుపోటములు సహజమే. అలాగే దర్శకులన్నాక.. హిట్లు, ఫ్లాపులు కూడా కామనే. కెరీర్ ఆరంభం నుంచీ ఎంత మంచి చరిత్ర ఉన్న డైరెక్టర్ అయినా సరే.. ఏదో ఒక సమయంలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ అంచనాలతో సినిమాలను తెరకెక్కిస్తే అవి ఒక్కోసారి ప్రేక్షకులను నిరాశ పరిచిన సమయాలు కూడా ఉంటాయి. అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా డైరెక్టర్లు తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి మంచి సినిమాలను తెరపైకి తీసుకుస్తుంటారు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇంత వరకూ ఫ్లాప్ రుచి చూడలేదు. పైగా తాను తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినవే. అయితే తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ లేని డైరెక్టర్ అనగానే మనకు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గుర్తొస్తాడు. కానీ పైన చెప్పింది మాత్రం ఆయన గురించి కాదు.
Karan Johar Directed Movies : ఆయనలాగే ఇండస్ట్రీలో మరో డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయనే బాలీవుడ్‌కి చెందిన దర్శక నిర్మాత కరణ్ జోహార్. బీటౌన్‌లో దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన ఆయన.. ఓ దర్శకుడిగానే కాదు ఓ నిర్మాతగానూ రాణిస్తున్నారు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన కరణ్.. ఆ తర్వాత 1998లో తెరకెక్కిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 107 కోట్లకు మేర వసూళ్లను అందుకుని ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.
ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన 'కభీ ఖుషీ కభీ గమ్', 'కభీ అల్విదా నా కెహనా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు మార్క్‌ను దాటగా.. 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమా ఏకంగా రూ. 223 కోట్లు సంపాదించింది. ఇక 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో మరో 100 కోట్ల మార్క్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను దాటింది.