Raghavendra Rao OTT: సినీ పరిశ్రమకు ఓటీటీ ఓ భూతంగా మారిందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా ఉండే కథలతో దర్శకులు సినిమాలు తీయాలని ఆయన సూచించారు. తన సమర్పణలో శ్రీధర్ సిపాన దర్శకత్వం వహించిన 'పండుగాడ్' టీజర్‌ను హైదరాబాద్‌లో రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'పండుగాడ్' చిత్ర నటీనటులు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపిన ఆయన.. చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నరోజుల్లో హాయిగా నవ్వుకునేలాంటి పెద్ద సినిమా ఈ 'పండుగాడ్' అంటూ ప్రశంసించారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, సప్తగిరితోపాటు టాలీవుడ్‌లోని హాస్యనటులంతా వివిధ పాత్రల్లో నటించారు. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Posani New Movie: నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు'. పోసాని కుమారుడు ఉజ్వల్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. హైదరాబాద్ ప్రసాద్ థియేటర్లో చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. విభిన్న కథతో 30 రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తామని, ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పోసాని తెలిపారు.
Rama Rao On Duty Release Date: ప్రభుత్వాధికారిగా హీరో రవితేజ నటించిన చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. జూన్ 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇటీవలే వాయిదా పడింది. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. జులై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది.