'మా' ఎన్నికల్లో ఇచ్చిన 90శాతం వాగ్దానాలు పూర్తయ్యాయని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "'మా'లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. 5 నిమిషాలైనా సినిమాలో డైలాగు చెప్పిన వాళ్లకే అసోసియేట్ సభ్యత్వం. అసోసియేట్ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు" అని విష్ణు తెలిపారు.
"2021 అక్టోబరు 13న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నా. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా పోటాపోటీగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తి చూపారు. నేను 'మా'కు మాత్రమే కాదు ప్రేక్షకులకూ జవాబుదారిని. మేం చేసిన వాగ్దానాల్లో 90శాతం పూర్తయ్యాయి. 'మా'లో నటులుకాని సభ్యులూ ఉన్నారు. సభ్యత్వం విషయంలో కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు రెండు సినిమాల్లో నటించి, ఆ చిత్రాలు విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. క్యారక్టర్ ఆర్టిస్టులు కనీసం పది సినిమాల్లోనైనా నటించి ఉండాలి. ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించాలి. అసోసియేట్ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు. సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. నిర్మాత మండలి.. 'మా' సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. 'మా'కు వ్యతిరేకంగా నటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే 'మా' ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 'మా' భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించా. ఫిల్మ్‌నగర్ సమీపంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ప్రస్తుతమున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తా. చాలామంది సభ్యులు రెండోదానికే ఆమోదం తెలిపారు"