Cinema Actors Startups: సినీ రంగంలో అవకాశాలూ, విజయాలూ ఎప్పుడు ఎవరిని వరిస్తాయో చెప్పలేం. సంపాదనను సరిగా పొదుపూ, మదుపూ చేయకపోతే... ఎన్ని ఇబ్బందులు పడాలో కళ్లముందే కనిపించిన ఉదాహరణలెన్నో వీరి ఆలోచనల్ని మార్చాయి. అందుకే ఈతరం నటులు... చేతినిండా పని ఉన్నప్పుడే నాలుగు రూపాయల్ని వెనకేసుకోవాలనుకుంటున్నారు. సౌకర్యవంతమైన జీవనం జీవితాంతం సాగాలంటే డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలో తెలుసుకున్నారు.
అందుకే, ఇలా కెరీర్‌లోకి అడుగుపెడుతున్నారో లేదో వెంటనే తమదైన ఆర్థిక ప్రణాళికను అమలు చేసేస్తున్నారు. ఓ పక్క నటిస్తూనే... సొంత బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నయా ఆవిష్కరణలతో, వినూత్న పరిష్కారాలతో ముందుకొస్తోన్న స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతూ వాటికి ఊతమిస్తున్నారు, ఆదాయాన్నీ అందుకుంటున్నారు.
కోట్లలో పెట్టుబడులు...
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరిదీ ఇదే బాట. అయితే, ఇలా పెట్టుబడులు పెట్టడంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణెది అగ్రస్థానం. సౌందర్య ఉత్పత్తుల వ్యాపార సంస్థ పర్పుల్ డాట్‌కామ్‌లో మూడు కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టింది దీపిక. అలానే... ఓ యోగర్ట్ తయారీ సంస్థలోనూ, ఎలక్ట్రిక్ ట్యాక్సీ కంపెనీ బ్లూస్మార్ట్, స్పేస్ టెక్ స్టార్టప్‌లైన బెల్లాట్రిక్స్, ఏరో స్పేస్‌తో పాటు నువా అనే వెల్‌నెస్ బ్రాండ్‌లలోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది.
ఇలా దీపిక మాత్రమే కాదు, కొవిడ్ కాలంలో ప్రజలకు సేవలందించి వార్తల్లో నిలిచిన హీరో, మన టాలీవుడ్ విలన్ సోనూసూద్ కూడా ఈ దారిలోనే నడుస్తున్నాడు. గ్రామీణుల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తోన్న ఇన్‌ఫర్మేటిక్స్ ఎల్‌ఎల్‌పీ అనే రూరల్ ఫిన్‌టెక్ కంపెనీలో ఇప్పటికే కోట్ల రూపాయల్ని మదుపు చేశాడు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఎక్స్‌ప్లర్జర్‌లోనూ మదుపు చేసి వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు.