'జల్లికట్టు'తో సంచలనం విజయం అందుకున్న దర్శకుడు లిజో జోస్ పెలిస్సెరీ. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ మంగళవారం ప్రకటించారు. జాన్ అండ్ మేరీ క్రియేటివ్, మాక్స్ ల్యాబ్స్ అండ్ సెంచరీ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఇండియాలోనే మేటి సృజనాత్మక దర్శకుల్లో ఒకరైన లిజో జోస్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకొస్తా' అని ఈ సందర్భంగా మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ఆయన చివరిసారి 'మాన్‌స్టర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
అతిథి పాత్రలో శివ రాజ్‌కుమార్..
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ మరోసారి అతిథి పాత్రలో తమిళ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా వస్తున్న 'జైలర్'లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కెప్టెన్ మిల్లర్'లో నటించబోతున్నట్లు ప్రకటించారు. "ధనుష్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలో నన్ను నేను చూసుకుంటాను. స్నేహితులతో ఆయన ఉండే తీరు చూస్తే నాలాగే అనిపిస్తుంది. ఈ చిత్రంలో నా పాత్ర ఏంటో చెప్పను కానీ బాగుంటుంది అని మాత్రం చెప్పగలను" అని చెప్పారు శివరాజ్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1930ల నాటి కథతో తెరకెక్కుతోంది.
థ్రిల్లింగ్ 'ఫోకస్'
విజయ్ శంకర్, అషూ రెడ్డి జంటగా జి.సూర్యతేజ తెరకెక్కించిన చిత్రం 'ఫోకస్'. వీరభద్రరావు పరిస నిర్మాత. భాను చందర్, జీవా, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ట్రైలర్‌ను నటుడు శ్రీకాంత్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సూర్యతేజ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు".
క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’" అన్నారు."ఇదొక కొత్త తరహా క్రైమ్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా"అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో విజయ్ శంకర్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నవ్వులే నవ్వులు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. వెంకట్ బోయనపల్లి నిర్మాత. బ్రహ్మాజీ, నెల్లూరు సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో ప్రభాస్ మంగళవారం విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో సంతోష్ మాట్లాడుతూ.. "కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది. గతంలో మేర్లపాక గాంధీ కథతో 'ఏక్ మినీ కథ' చేశా. అది పెద్ద హిట్టయ్యి నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చింది.ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.