Ginna Prerelease Event: వేడుకలో తక్కువగా మాట్లాడాలని తన తనయుడు, నటుడు మంచు విష్ణు చెప్పిన మాటకు షాక్ అయ్యానన్నారు మోహన్‌బాబు. 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ కథానాయికలు. మోహన్‌బాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 21 విడుదలకానుంది.
వేడుకనుద్దేశించి మోహన్‌బాబు మాట్లాడుతూ.. "ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఎందరో హీరోల వేడుకల్లో, అబ్దుల్ కలాం మా విద్యా సంస్థకు వచ్చినప్పుడూ 'ఇన్ని నిమిషాలే మాట్లాడాలి' అని ఎవరూ నాకు చెప్పలేదు. కానీ, విష్ణు నన్ను ఈ రోజు తక్కువగా మాట్లాడాలన్నాడు. అది విని షాక్ అయ్యా. 'పెద్దవాళ్లు చెప్పలేదు కదా.. అయినా నేను ఎక్కువగా మాట్లాడతా’ అని అనిపించింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. బిడ్డలను పదిమందిలో పొడగకూడదంటుంటారు. విష్ణు ఎంత గొప్పగా నటించాడో నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకూ కష్టపడనంత విధంగా విష్ణు 'జిన్నా'కు కష్టపడ్డాడు. ఈ సినిమాకు నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. అది విష్ణుకి బాగుంటుందని కోన వెంకటే చెప్పాడు. సూర్య ఓర్పు, సహనం ఉన్న దర్శకుడు. చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. ఇందులోని 'జారు మిఠాయా' సూపర్ హిట్ కావడానికి దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి కారకుడు. మేం అడగ్గానే వచ్చి, ఈ సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకు అభినందలు" అని మోహన్‌బాబు తెలిపారు.
"ఈ సినిమా విషయంలో ముందుగా కోన వెంకట్, చోటా కె. నాయుడుగారికి థ్యాంక్స్. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించాడు. మీరంతా చిత్రాన్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా" అని విష్ణు అన్నారు. అనంతరం కుటుంబం సభ్యుల గురించి చెబుతూ.. తనకు ప్రతి విషయంలో మోహన్‌బాబు స్ఫూర్తి అని, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎలా చేయాలో తన తల్లి నుంచి, కనుసైగలతో ఎలా కంట్రోల్ చేయాలో తన భార్య నుంచి నేర్చుకోవచ్చని విష్ణు సరదాగా చెప్పారు.