ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులను, రివార్డులనూ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించగా.. ఇప్పుడు ఈ సినిమాకు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అలానే ఈ చిత్రంలోని నాటు నాటు పాట .. బెస్ట్ సాంగ్ అవార్డును దక్కించుకుంది.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాన్ని వేడుకలో పాల్గొని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయన.. తన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంపై సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. తన కెరీర్లో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.