తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మిథునం' కథా రచయిత శ్రీరమణ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Mithunam Writer Passed Away : 'మిథునం' కథా రచయిత శ్రీరమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

By

Published : Jul 19, 2023, 8:45 AM IST

Updated : Jul 19, 2023, 9:46 AM IST

mithunam writer sri ramana passed away
mithunam writer sri ramana passed away

Mithunam Writer Passed Away : 'మిథునం' కథా రచయిత శ్రీరమణ (70) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం వేకువజామున 5 గంటలకు కన్నుమూశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

బాపు- రమణతో కలిసి..
గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న శ్రీరమణ జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. సినీ రంగంలో బాపు- రమణతో కలిసి ఆయన పనిచేశారు. ముఖ్యంగా పేరడీ రచనలకు శ్రీరమణ ఎంతగానో ప్రసిద్ధి. ఆయన పలు తెలుగు పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో కీలక పాత్ర వహించారు.

2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. 'పత్రిక' అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. ఓ కలమిస్టుగా, కథకుడిగా, సినీ రంగంలో నిర్మాణ నిర్వహణ పరంగా ఆయన ఎనలేని సేవలు అందించారు. అంతే కాకుండా సాహిత్య, కళా రంగాల్లో తన రచనలతో చెరగని ముద్ర వేశారు. ఈయన రచించిన మొగలి రేకులు, శ్రీ ఛానెల్, శ్రీ కాలమ్, పందిరి, హాస్య జ్యోతి లాంటి ఎన్నో శీర్షికలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. అవన్నీ రచయితగా ఆయన పేరును దశ దిశలా వ్యాపించేలా చేశాయి.

మిథునం సినిమాకు..
Mithunam Movie Writer : ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ప్రముఖ టాలీవుడ్​ మూవీ 'మిథునం' సినిమాకు శ్రీరమణే కథ అందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే అప్పటికే పాతిక సంవత్సరాల క్రితమే శ్రీ రమణ 25 పేజీల 'మిథునం' కథను రచించారు. ఇకపోతే ఈ చిత్రంలో దివంగత గాయకుడు ఎస్​పీ బాలసుబ్రమణ్యం, సీనియర్​ నటి లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మనసుకు హత్తుకునేలా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిని తనికెళ్ల భరణి అద్భుతంగా చిత్రీకరించారు.

Last Updated : Jul 19, 2023, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details