Mike Tyson Liger Movie: మైక్‌టైసన్ పరిచయం అక్కర్లేని పేరు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్'లో అతిథి పాత్రలో మెరిశారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ కావడంతో 'లైగర్'కు అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు చిత్ర బృందం టైసన్‌ను ఇందులో నటింపజేసింది. అయితే, తాను ఈ చిత్రంలో నటించిన విషయమే టైసన్ గుర్తులేదా?
ఓ పాడ్‌కాస్ట్ వీడియోలో స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా.. 'లైగర్‌లో మీ పాత్ర ఏంటి?' అని టైసన్‌ను అడగడం వల్ల ఆయన కాస్త తికమక పడ్డారు. అలాంటి చిత్రంలో నటించిన విషయమే ఆయనకు గుర్తుకు రాలేదు. 'ఏదీ మళ్లీ ఒకసారి చెప్పు' అన్నారు. వెంటనే ఆయన స్నేహితులు గూగుల్‌లో సెర్చ్ చేసి చూపించి 'బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్‌లో నటిస్తున్నారు' అంటూ చదివి వినిపించారు. ఆ తర్వాత ఆ చర్చ 'లైగర్' జంతువు వైపు మళ్లింది. 'మీరు లైగర్‌తో పోటీ పడ్డారా' అని అడగ్గా.. 'లేదు' అని టైసన్ సమాధానం ఇచ్చారు. 'దానికి ఎదురుపడితే రెండు సెకన్లలో చంపేస్తుంది' అని అన్నారు. ఈ చర్చ మధ్యలోనే 'లైగర్' ట్రైలర్ గురించి వెతగ్గా.. ఫ్యాన్‌మేడ్ ట్రైలర్ కనిపించింది. అలా 2021లో రికార్డు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మైక్‌టైసన్‌ను నటింపజేసేందుకు చాలా కష్టపడినట్లు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో తెలిపింది. ఏడాది పాటు శ్రమించిన తర్వాత బాక్సింగ్ లెజెండ్ నటించేందుకు అంగీకరించారని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు.