తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆయన సహకారం వల్లే 'ఆచార్య' సెట్​' - చిరంజీవి ఆచార్య

Acharya movie set: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆచార్య'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్​కు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతవరకు ఎన్నడూ ఏ చిత్రానికి చేయని విధంగా సుమారు 20 ఎకరాల్లో 'ఆచార్య' కోసం 'ధర్మస్థలి' అనే సెట్​ను తీర్చిదిద్దారు. ఒకే చోట ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ క్రమంలో ఈ సెట్​ను రూపొందించిన కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ సంగతులివీ..

Acharya art director
ఆచార్య సెట్

By

Published : Apr 25, 2022, 8:15 AM IST

Acharya movie set: 'ఆచార్య' చిత్రం విడుదలకు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏ చిత్రానికి చేయని విధంగా సుమారు 20 ఎకరాల్లో ఆచార్య కోసం ధర్మస్థలి సెట్‌ను తీర్చిదిద్దారు. ఇండియన్ సినిమాలో ఒకే చోట ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవికి చెందిన 20 ఎకరాల సొంతస్థలంలో 4 నెలలపాటు శ్రమించి ధర్మస్థలి సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ పర్యవేక్షణలో వందల మంది పనిచేసి ధర్మస్థలిని నిర్మించారు. దక్షిణాదిలోని ప్రఖ్యాత దేవాలయాలను తలపించేలా సురేష్ ధర్మస్థలిని తీర్చిదిద్దారు. పూర్తిగా పర్యావరణ హితంగా, చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన సెట్‌లో దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే మారేడుమిల్లిలో గ్రామీణ ప్రాంతాన్ని తలదన్నేలా పాదఘట్టం అనే మరోసెట్ వేసి చిరంజీవి, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో ఆచార్య కోసం పనిచేసిన కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ తన అనుభవాలను పంచుకున్నారు.

"ఆచార్య లాంటి సినిమాకు పనిచేయడం నాకు దక్కిన అదృష్టం. కొరటాల శివకు ఏం కావాలో నాకు తెలుసు. 'భరత్‌ అనే నేను' చిత్రంతో ఆయన ఊహాలను నేను అర్థం చేసుకోగలిగాను. 'ఆచార్య'కు అది మరింత సులభమైంది. 'భరత్‌' పొలిటికల్‌ డ్రామా అయితే, ఇది అందుకు పూర్తి భిన్నం. సినిమా కోసం చాలా ప్రాంతాలు తిరిగాం. అయితే, కొన్ని చోట్ల షూటింగ్‌ చేసేందుకు అనుకూల పరిస్థితులు లేవు. దీంతో టెంపుల్‌ టౌన్‌ నిర్మించాం. నాలుగు నెలలకు పైగా ప్రీప్రొడక్షన్ వర్కు జరిగింది. టెంపుల్‌ సెట్‌ వేసేందుకు అందుకోసం 20 ఎకరాల స్థలం అవసరమైంది. చిరు సర్‌ అందుకు సహకారం అందించారు. సెట్‌లో ఏం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాకు రోజంతా పట్టేది. రోజూ ఏడెనిమిది వందల మంది పనిచేసేవారు. డిజిటల్‌ రూపంలోనూ సెట్స్‌ వేయొచ్చు. కానీ, సహజత్వం కనిపించాలనే ఎంత పెద్ద గోపురాలైనా సెట్స్‌ వేసి తీశాం"

"భరత్‌ అనే నేనుకు వేసిన అసెంబ్లీ సెట్‌కు నాకు మంచి పేరు వచ్చింది. 'ఆచార్య' ఓపెన్‌ సెట్‌. వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతినకుండా ఈ సెట్‌ వేశాం. నాలుగైదు ఏళ్లు అది ఏ మాత్రం దెబ్బతినదు. మేము వేసిన టెంపుల్‌ టౌన్‌ సెట్‌ చూసి చిరంజీవిగారు అభినందించారు. అంతకుమించిన అవార్డు ఇంకేముంటుంది. ఆయన తర్వాతి చిత్రానికి కూడా నాకు అవకాశం ఇచ్చారు. కథకు అవసరమైన సెట్‌ కావాలంటే నిర్మాత సహకారం కూడా అవసరం. నిరంజన్‌రెడ్డి అందుకు ఎంతగానో సహకరించారు. శివగారు టెంపుల్‌ సిటీ గురించి చెప్పగానే, చాలా ఆలయాలను సందర్శించాను. కేవలం కొన్ని ఆలయాల గర్భగుడులు మాత్రమే విభిన్నంగా ఉంటాయి. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుని, 'ఆచార్య' కోసం ప్రత్యేకమైన ఆలయాన్ని తీర్చిదిద్దాం. తెరపై ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని చూస్తారు. మేము వేసిన గుడి సెట్‌ ఇంకెక్కడా ఉండదు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో కొన్ని సెట్స్‌ రిపేర్‌ చేశాం. మళ్లీ పెయింటింగ్‌లు వేశాం. దీంతో ఇంకాస్త అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..

ABOUT THE AUTHOR

...view details